
శ్రీరాముడు పురుషోత్తముడు అంటారు కదా.
ఎందుకంటారు?
ఆయనకు తిరుగులేదు అనా? కానే కాదు.
వాళ్ళ పినతల్లి వల్ల అడవుల పాలు ఐనా ఆమె కొడుకుని రాజుగా చేసినా విధిని మాత్రం వినమ్రత తో పాటించాడు. ఎవ్వరినీ పల్లెత్తు మాట అనలేదు. తండ్రి మాట కోసం సుఖంగా ఉన్న జీవితాన్ని త్యాగం చేసి కష్టాల బాట ఎంచుకున్నాడు. తన కర్తవ్యాన్ని పూర్తి శ్రద్ధతో, శక్తి యుక్తులతో నిర్వర్తించాడు.
అందులో మనం తెలుసుకోవాల్సిన నిగూఢ రహస్యం ఏమిటంటే కష్టం లేకుండా జీవించడం గొప్ప విషయం కాదు. కష్టాల్లో ఉన్నా కూడా తన సౌమ్య శీలాన్ని, శక్తి యుక్తులను కోల్పోకుండా ఎలా ఉండాలో రాముడు మనకు చూపించాడు.
ఇది సత్యదూరం గా అనిపిస్తుంది మనకి. కానీ నిజం ఏంటంటే మనం మన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల ఇది సాధ్యం కాదు అని అనుకుంటాం.
ఈ రోజుల్లో మన ఇంటినీ సుఖాన్ని వదిలి వెళ్ళమని ఎవరూ చెప్పట్లేదు కదా! జీవితం లో వచ్చే ఒడిదుడుకులు తట్టుకుని నిలబడే నిబ్బరం ఉండాలి అంతే!
ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు వాడుకొని వదిలేస్తే అది బాధ. కానీ అలా జరగదు అని అనుకోవడం మన అమాయకత్వం. లోకంలో మనం తప్పు చేసినా భరించేది మన తల్లిదండ్రులే. ఇంకెవ్వరూ కనీసం మన కోసం మన కంటే ఎక్కువ ఆలోచించరు. అలా ఆలోచించాలనుకోవటం అమాయకత్వం కాదు వెర్రితనం.
నీ సమస్య అసలు పరిమాణం ఎంత? దానికి నువ్వు అనుభవించే బాధ ఎంత?
అడవి లో జంతువుల మధ్య ఎండకీ గాలికీ వానకీ చెట్టునో గుట్టనో చూసుకుని పరిగెత్తే పరిస్థితి ఇప్పుడు లేదు కదా! కూటికోసం రోజంతా కష్టపడి చెమటోడ్చి పని చేసే అవసరం కూడా లేదు కదా!
అవి తెలియక మన కష్టాలు కష్టంగా అనిపిస్తాయి కానీ నిజంగా మనం చాలా అదృష్టవంతులం కాదనగలరా?
సరే, ఆ కష్టాలే నయం అని అంటారా? మరి అంతకు మించిన సమస్య ఏముంది చెప్పండి మనకి!
అందుకే మనం సమస్యలు రాకుండా ఉండాలి అని కాదు - సమస్యకి పరిష్కారం వెతికే శక్తి, సామర్థ్యం పెంచుకోవాలి. సంతోషంగా ఉండాలి. శ్రీరాముని అడుగు జాడల్లో నడవాలి. మంచిగా మర్యాదగా, ధైర్యంతో ఉండాలి.
శ్రీరాముడు మనందరికీ ఆయన సౌమ్య శీలాన్ని, సహనాన్ని, శక్తి యుక్తులను ప్రసాదించాలి అని కోరుకుంటూ!
శ్రీరామ నవమి శుభాకాంక్షలు
Comments
Post a Comment