Skip to main content

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు


యత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమంతి దేవతాః |

యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలాః క్రియాః॥

- మను స్మృతి అధ్యాయం 3, శ్లోకం 56

మెదటి చరణం అందరికీ తెలిసిందే. ఆడవారు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని అర్థం. కానీ రెండో చరణం అర్థం మనుస్మృతి లో స్త్రీ కి ఉన్న గౌరవం, ప్రాముఖ్యత ఉటంకిస్తూ ఉంది.


యత్రైతాస్తు న పూజ్యంతే = యత్ర + ఇతి + న + అస్తు + పూజ్యంతే = ఎక్కడ ఆమె పూజించబడదో

సర్వాస్తత్రాఫలాః క్రియాః = సర్వః + తత్ర + అఫలాః + క్రియాః = అక్కడ ఏ పనీ ఫలించనట్టే.

అంటే ఎక్కడ స్త్రీ గౌరవించబడదో అక్కడ ఏమున్నా, ఎంతున్నా నిష్ప్రయోజనం అని.


స్త్రీ కి గౌరవం ఇవ్వండి అని చెప్పి ఊరుకోలేదు. ఆమెకు గౌరవం ఇవ్వని చోట ఇంకేమీ విలువైనది కాదు అని తర్కపూర్ణంగా ఉటంకిస్తూ చెప్పారు.

 ఇది మన సంస్కృతిలో స్త్రీ యొక్క స్థానం.


ముష్కర మూకలు మన మీద దాడి చెయ్యక ముందు కాలంలో స్త్రీకి అన్ని వ్యవహారాలలో అవకాశం, గౌరవం ఉండేది. స్త్రీ తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవటానికి నిర్ణయించుకున్నా, విద్య నుంచి యుద్ధం వరకు ఏ అంశంలో ఉండాలని నిర్ణయం తీసుకున్నా సమానమైన గౌరవం ఉండేది.


వేదాలు వ్రాసిన వారిలో లోపముద్ర వంటి స్త్రీ మూర్తులు ఉన్నారు. వేదాలు అపౌరుషేయాలు అంటారు కదా? మరి వ్రాయటం ఏమిటి? అని సందేహం కలగవచ్చు. వేదాలు అపౌరుషేయాలే. కానీ వాటిని గ్రంథస్థం చేయడం జరిగింది.


గార్గీ, మైత్రేయి వంటి తత్వవేత్తలు ఉండేవారు. గార్గి యాజ్ఞవల్క్య మహాముని తో జనక రాజు కొలువులో వాదించి ఆయన జ్ఞానాన్ని పరీక్షించింది. మైత్రేయి కూడా గొప్ప తత్త్వవేత్త. యాజ్ఞవల్క్య మహాముని భార్య కూడా. వీరి గురించి బృహదరణ్యక ఉపనిషత్తులో ఉన్నది.


ఆండాళ్ అని వైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వారుల (ఆ సాంప్రదాయం లో ప్రధాన ఋషులు) లో ఒకరు.


మీరాబాయి, మొల్ల వంటి కవయిత్రులు ఉండేవారు. 


నయనిక, ప్రభావతి గుప్త వంటి పరిపాలనా దక్షత కలిగిన రాణులు ఉండేవారు.


రాణీ రుద్రమ దేవి, ఝాన్సీ లక్ష్మీ బాయి వంటి వీర వనితలు ఉండేవారు.


అలాంటి స్త్రీ మూర్తులని మనం మళ్ళీ చూసేలా మన సమాజం పరిపక్వత పొందాలి అని ఆశిద్దాం. అందుకు సరిపడే అనుకూల వాతావరణం సమకూర్చుదాం.

బైట నుండి వచ్చి ముష్కరులకి స్త్రీ ఒక భోగ వస్తువు లాంటిది మాత్రమే. వాళ్ళ పరిపాలన లో శతాబ్దాలుగా మగ్గి మనం కూడా వాళ్ళ స్థాయి దిగజారి పోయాం అంటే కంటగింపుగా ఉంటుంది కానీ వాస్తవం మాత్రం చేదు మాత్ర. మరీ వాళ్ళంతగా దిగజారి పోలేదు కావచ్చు కానీ మన ప్రస్తుత పరిస్థితి మాత్రం గొప్పగా లేదు. వాళ్ళు స్త్రీని భోగ వస్తువులుగా భావించి మన ఇంటి ఆడవాళ్లని చెరబట్టడం లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు మన వాళ్ళు మన మహిళలకు ఆంక్షలు విధించడం జరిగి ఉండవచ్చు. నేనేమీ అతిశయోక్తి గా చెప్పట్లేదు. నైజాం పరిపాలనలో రజాకార్ల గురించి విని ఉంటారు. వాళ్ళ పైశాచిక ప్రవర్తన వాళ్ళ ప్రభువుల అంతరంగాన్ని ప్రతిబింబిస్తుంది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అని సామెత. వాడే వెధవైతే ఇంకా ఆ మూకలకి అడ్డు ఆపు ఏముంటుంది?

ఆ తరువాత కూడా మన పరిస్థితులు ఏం గొప్పగా మారిపోలేదు. కారణాలు అనేకం.

ఆడపిల్ల పుడితే ఎలా సంరక్షిస్తాం అని విచారించే పరిస్థితి దాటి వాళ్ళని శక్తివంతంగా పెంచడం, వారి చుట్టూ ఉన్న పరిస్థితులు సకారాత్మకంగా ఉంచటం, జీవితం పట్ల సరైన అవగాహన కల్పించడం, భద్రత కల్పించడం గురించి ఆలోచించాలి, పని చెయ్యాలి.

సహజంగా స్త్రీ సున్నితమైన శరీరం, మనసు కలిగి ఉంటుంది. అలా ఉండాలా లేదా మార్పు చెందాలా అనేది తన వ్యక్తిగత అభిరుచి కావాలి తప్ప తను ఇలాగే ఉండాలి అంటూ ఎటువైపు ఉంచి గీత గీసినా తనకు న్యాయం జరగదు.

కుహనా స్త్రీ సముద్ధరణ వాదులు - అర్ధ నగ్నంగా బట్టలు వేసుకుంటేనే స్వేచ్ఛ, ఇష్టం వచ్చినట్టు ఉండనిస్తేనే గౌరవించినట్టు అంటున్నారు - అదే జీవిత పరమార్థం ఐనట్టు! అది దాటి వాళ్ళ ఆలోచనలు ఎదగలేదు కాబోలు.

స్త్రీ శక్తి, అభిరుచి కేవలం బట్టలకు పరిమితం కాదు. ఆమె శక్తి సామర్థ్యాలు పూర్తిగా ప్రకటితమవ్వాలి అంటే ఆడపిల్లని గౌరవంగా మాత్రమే చూసే పరిస్థితి ఉండటం మంచిది కదా? అందుకే వేషధారణ లాంటి అల్ప విషయాల పైన శ్రద్ధ తగ్గించి  వాళ్ళకు నిజమైన పురోగతిని అందించే విషయాల మీద దృష్టి పెట్టాలి.

మన మహిళా శక్తి ఇప్పటికే చాలా రంగాల్లో పురోగతి సాధించింది. విద్య, వైద్యం, యుద్ధం, అంతరిక్షం- ఏ రంగంలో చూసినా మహిళల పాత్ర ఎంతో ఉంది. చంద్రయాన్ మిషన్ లో మహిళల భాగస్వామ్యం చూసే ఉంటారు. ఆపరేషన్ సింధూర్ లో మన శివంగులు ఎలా చెలరేగి పాకీ మూకల తుక్కు రేగ్గొట్టారో చూసి ఉంటారు కదా! అదీ మహిళా శక్తి. అదీ మహిళా సాధికారత.

మనం ఇక్కడి నుంచి సరైన దారిలో ముందుకు పోవాలి అంతే. మన దేశం మళ్ళీ అగ్రగామిగా నిలుస్తుంది. 

2047 నాటికి మనం మళ్ళీ ప్రపంచంలో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ గా మారటానికి అవకాశం ఉంది. ఈ అవకాశం లో స్త్రీ శక్తి మనకి తోడుగా ఉండాలి. ఉంటుంది. మనందరం ఒకరినొకరు గౌరవించుకుంటూ  ఒకరికొకరు తోడుగా నడిస్తే ప్రపంచ విజేతలు కావడం ఖాయం. మన పురోగతి కేవలం మనకు మాత్రమే కాదు ప్రపంచం మెత్తానికి మంచి జరుగుతుంది.  అందరినీ కలుపుకొని పోయే మన మనస్తత్వం - వసుధైక కుటుంబం.

స్త్రీ శక్తిని గెలిపిద్దా! ఇంట గెలిచి రచ్చ గెలుద్దాం.

Comments

Popular posts from this blog

🌿 ఉగాది పండగ - ఎందుకు, ఏమిటి, ఎలా?

  ఉగాది అంటే కేవలం ఒక పండుగ కాదు… ఇది కొత్త ఆలోచనలకు, కొత్త ఆశలకు, కొత్త జీవనానికి ప్రారంభం. ఉగాది  - యుగాది అనే పదం నుండి వచ్చింది. “యుగాది” అంటే  “యుగం + ఆది” — అంటే కాలానికి ఆరంభం అని అర్ధం . తెలుగు ప్రజలకు ఇది నూతన సంవత్సర ప్రారంభం మాత్రమే కాదు, జీవితాన్ని కొత్త కోణంలో చూడటానికి ఒక అవకాశం. 🌼 వసంత ఋతువు – ప్రకృతి ఉత్సవం  వసంత ఋతువు ఉగాదితో ప్రారంభమౌతుంది. ప్రకృతి కొత్త జీవితాన్ని అందుకుంటుంది. శరీరానికి, మనసుకు హాయిగా ఉంటుంది. ప్రకృతి సహజంగా జీవ శక్తిని పెంచుతుంది. మామిడి పూలు వేప పువ్వులు పచ్చని చెట్లు ఇది ప్రకృతి మనకు ఇచ్చే ఒక అవకాశం.  ఉపయోగం లేని అలవాట్లు విడిచిపెట్టి జీవితానికి సహకరించే అలవాటులను, అవకాశాలను ఆహ్వానించాలి. 🌸 ఉగాది యొక్క ప్రాముఖ్యత చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సంవత్సర ఆరంభమౌతుందని పంచాంగ శాస్త్రం చెబుతుంది. పురాణాలలో సృష్టి ఆరంభం వసంతంతో మొదలౌతుంది అని చెప్పబడింది. ఆ వసంతం చైత్రమాసం తో మొదలౌతుంది. చైత్రమాసం లో మొదటి రోజునే ‘యుగాది’గా భావించడం సాంప్రదాయంగా ఏర్పడింది.   బ్రహ్మ దేవుడు  ఈ రోజే సృష్టిని ప్రారంభించాడ...

శ్రీరామనవమి శుభాకాంక్షలు

శ్రీరాముడు పురుషోత్తముడు అంటారు కదా. ఎందుకంటారు? ఆయనకు తిరుగులేదు అనా? కానే కాదు.  వాళ్ళ పినతల్లి వల్ల అడవుల పాలు ఐనా ఆమె కొడుకుని రాజుగా చేసినా విధిని మాత్రం వినమ్రత తో పాటించాడు. ఎవ్వరినీ పల్లెత్తు మాట అనలేదు. తండ్రి మాట కోసం సుఖంగా ఉన్న జీవితాన్ని త్యాగం చేసి కష్టాల బాట ఎంచుకున్నాడు. తన కర్తవ్యాన్ని పూర్తి శ్రద్ధతో, శక్తి యుక్తులతో నిర్వర్తించాడు. అందులో మనం తెలుసుకోవాల్సిన నిగూఢ రహస్యం ఏమిటంటే కష్టం లేకుండా జీవించడం గొప్ప విషయం కాదు. కష్టాల్లో ఉన్నా కూడా తన సౌమ్య శీలాన్ని, శక్తి యుక్తులను కోల్పోకుండా ఎలా ఉండాలో రాముడు మనకు చూపించాడు.  ఇది సత్యదూరం గా అనిపిస్తుంది మనకి. కానీ నిజం ఏంటంటే మనం మన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల ఇది సాధ్యం కాదు అని అనుకుంటాం. ఈ రోజుల్లో మన ఇంటినీ సుఖాన్ని వదిలి వెళ్ళమని ఎవరూ చెప్పట్లేదు కదా! జీవితం లో వచ్చే ఒడిదుడుకులు తట్టుకుని నిలబడే నిబ్బరం ఉండాలి అంతే! ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు వాడుకొని వదిలేస్తే అది బాధ. కానీ అలా జరగదు అని అనుకోవడం మన అమాయకత్వం. లోకంలో మనం తప్పు చేసినా భరించేది మన తల్లిదండ్రులే. ఇంకెవ్వరూ కనీసం మన కోసం మన కంటే ఎక్కువ ఆలోచించరు. అల...