Skip to main content

🌿 ఉగాది పండగ - ఎందుకు, ఏమిటి, ఎలా?

 

ఉగాది అంటే కేవలం ఒక పండుగ కాదు…
ఇది కొత్త ఆలోచనలకు, కొత్త ఆశలకు, కొత్త జీవనానికి ప్రారంభం.

ఉగాది  - యుగాది అనే పదం నుండి వచ్చింది. “యుగాది” అంటే “యుగం + ఆది” — అంటే కాలానికి ఆరంభం అని అర్ధం.

తెలుగు ప్రజలకు ఇది నూతన సంవత్సర ప్రారంభం మాత్రమే కాదు, జీవితాన్ని కొత్త కోణంలో చూడటానికి ఒక అవకాశం.


🌼 వసంత ఋతువు – ప్రకృతి ఉత్సవం

 వసంత ఋతువు ఉగాదితో ప్రారంభమౌతుంది. ప్రకృతి కొత్త జీవితాన్ని అందుకుంటుంది. శరీరానికి, మనసుకు హాయిగా ఉంటుంది. ప్రకృతి సహజంగా జీవ శక్తిని పెంచుతుంది.
  • మామిడి పూలు

  • వేప పువ్వులు

  • పచ్చని చెట్లు

ఇది ప్రకృతి మనకు ఇచ్చే ఒక అవకాశం. ఉపయోగం లేని అలవాట్లు విడిచిపెట్టి జీవితానికి సహకరించే అలవాటులను, అవకాశాలను ఆహ్వానించాలి.


🌸 ఉగాది యొక్క ప్రాముఖ్యత

చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సంవత్సర ఆరంభమౌతుందని పంచాంగ శాస్త్రం చెబుతుంది.

పురాణాలలో సృష్టి ఆరంభం వసంతంతో మొదలౌతుంది అని చెప్పబడింది. ఆ వసంతం చైత్రమాసం తో మొదలౌతుంది. చైత్రమాసం లో మొదటి రోజునే ‘యుగాది’గా భావించడం సాంప్రదాయంగా ఏర్పడింది.  బ్రహ్మ దేవుడు ఈ రోజే సృష్టిని ప్రారంభించాడని విశ్వాసం ఉంది.

శాస్త్రాలు, పురాణాలు, వేదాలు నమ్మను అంటారా? కనీసం కొంచెం శాస్త్రీయ దృక్పధం ఉంటే అర్ధమయ్యే విషయాలు చూద్దాం.

వసంతం చైత్ర మాసం తో మొదలవుతుంది. ఈ కాలంలో మొక్కలు చిగురిస్తాయి. పువ్వులు పూస్తాయి. కొత్త విత్తనాలు మొలకెత్తుతాయి. ఉగాది రోజున మన రైతులు విత్తనాలు చల్లటానికి భూమిని సన్నద్ధం చెయ్యటం, విత్తనాలు నాటడం చూసి ఉంటారు. చూడకపోయినా తెలుసుకోండి. మన రైతులకు ఇది కొత్త పంటకు విత్తనాలు నాటే సమయం ఇది.

ఇది జీవం కొత్త ఉత్తేజాన్ని పొందే సమయం. కొత్త జీవితాన్ని ప్రారంభించే కాలం.  చెట్లు కొత్త చిగుళ్లు వేస్తాయి. ప్రకృతి చాలా రమణీయంగా మారుతుంది. పక్షులు, జంతువులు ఈ సమయంలో ప్రశాంతతను పొందుతాయి. వాతావరణం ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంటుంది. మరీ చలిగా గానీ, మరీ వేడిగా గానీ ఉండదు. సహజంగా ఏ రకమైన రక్షణ అవసరం లేకుండా, ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. ఉగాది తో ఈ ప్రక్రియ మొదలౌతుంది.  

ఎంత తర్క సమ్మతంగా ఉందో కదా? సంవత్సరం మొదలవటానికి ఇంత కంటే మంచి సమయం ఎప్పుడు? అందుకే మన సాంప్రదాయం లో ఉగాది పండుగ కొత్త యుగానికి నాంది అని నమ్ముతాము.



🏡 ఉగాది ఉదయం – ఇంటి నుంచి ఆత్మ వరకు శుభ్రత

ఉగాది రోజు తెల్లవారుజామునే ప్రారంభమవుతుంది:

  • ఇంటిని శుభ్రపరచడం

  • మామిడి ఆకులతో తొరణాలు కట్టడం

  • రంగవల్లులు వేయడం

  • స్నానం చేసి కొత్త బట్టలు ధరించడం

ఇది కేవలం బయట శుభ్రత కాదు — మనసు, ఆలోచనలు కూడా శుభ్రం చేసుకోవాలి అనే సందేశం. 

ఇది ప్రకృతి సిద్ధంగా కొత్త ఉత్తేజాన్ని పొందే సమయం. జీవిత గమనం లో ఒడిదుడుకులను ఓర్చుకుని సాగే ప్రయాణం లో కొత్త ఊపిరి పోసుకునే సమయం. కాస్త విశ్రమించి ఆలోచించి జీవితానికి ఉపయోగపడే మార్పులు, చేర్పులు చేసుకునే సమయం.



📜 పంచాంగ శ్రవణం – భవిష్యత్తు దర్శనం

ఉగాది రోజు ముఖ్యమైన ఆచారం:

👉 పంచాంగ శ్రవణం

పంచాంగం అనేది తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంగాల ద్వారా కాలాన్ని విశ్లేషించే భారతీయ జ్యోతిష శాస్త్రం. పంచాంగం - కాలాన్ని 5 కోణాల్లో అర్థం చేసుకునే వ్యవస్థ.  

మన సమకాలీన భాషలో ప్రోజక్ట్ ఎస్టిమేషన్ అనుకోండి. ఎస్టిమేషన్ లోనే ప్రోజక్ట్ పూర్తి అయ్యే అవకాశాలు తక్కువే. కానీ అది కూడా లేకుండా దిగితే ఎప్పటికీ తెగదు కదా. ఏమేమి కావాలి, ఎలాంటి వనరులు సమకూర్చుకోవాలి, ఎంత ధనం వెచ్చించాలి లాంటి వివరాలు ముందుగా అనుకోకుండా ఆ పని మొదలు పెట్టము కదా. 

అలాగే పండితులు కొత్త సంవత్సర ఫలితాలను గణించి చెబుతారు:

  • రాశి ఫలాలు

  • వర్షాలు, వ్యవసాయం

  • ఆర్థిక పరిస్థితులు

  • శుభ ముహూర్తాలు

ఇది మన జీవితానికి ఒక మార్గదర్శకంగా భావిస్తారు. 

ఇవి మార్గదర్శకాలు మాత్రమే. మధ్యలో వచ్చే అవకాశాలు అందుకుని, అవాంతరాలు కూడా దాటి విజయం వైపు నడిచేవారికే విజయం దక్కుతుంది. అందుకు కావాల్సిన ఉత్సాహం, ఆలోచన, అవగాహన సమకూర్చుకుని సంవత్సరాన్ని ప్రారంభించాలి.



🥭 ఉగాది పచ్చడి – జీవితానికి ప్రతిబింబం

ఉగాది పచ్చడి ఈ పండుగలో అత్యంత ప్రత్యేకమైనది.
ఇందులో షడ్రుచులు (6 రుచులు) ఉంటాయి:

  • తీపి (బెల్లం) → ఆనందం

  • చేదు (వేపపువ్వు) → బాధ

  • పులుపు (చింతపండు) → ఆశ్చర్యం

  • ఉప్పు → జీవన సమతుల్యత

  • కారం → కోపం

  • వగరు → భయం

👉 సందేశం:
జీవితం ఈ అన్ని అనుభవాల మిశ్రమం. వాటిని సమానంగా స్వీకరించాలి.



🪔 సాంప్రదాయ వంటలు

పండగ అంటే పిండి వంటలు లేకపోతే మజా ఎలా వస్తుందండీ? అందుకే ఉగాది రోజున చేసే ప్రత్యేక వంటకాలు:

  • బొబ్బట్లు

  • పులిహోర

  • మామిడి కాయ పప్పు

  • చల్లని పానకాలు

ఈ వంటలు కుటుంబాన్ని ఒకచోట చేర్చే సాధనం.


🎭 ఉగాది & సాహిత్యం

తెలుగు సాహిత్యంలో ఉగాది కి ప్రత్యేక స్థానం ఉంది:

  • ఉగాది కవితలు

  • కవిసమ్మేళనాలు

  • సాహిత్య కార్యక్రమాలు

ఇది సృజనాత్మకతకు ఒక పండుగ.


👨‍👩‍👧‍👦 కుటుంబం & బంధాలు

ఉగాది రోజు:

  • పెద్దలకు నమస్కారం చేసి ఆశీర్వాదాలు పొందే అలవాటు ఉంది

  • కుటుంబ సభ్యులతో సమయం గడిపి మధురమైన అనుభూతులను పోగుచేసుకోవటం

👉 ఇది బంధాలను బలపరచే పండుగ.


🌟 ఉగాది యొక్క జీవన తత్త్వం

ఉగాది మనకు నేర్పేది:

  • మార్పును స్వీకరించాలి

  • ఆనందం, బాధ రెండూ జీవితంలో వాటి పాత్రను పోషిస్తాయి

  • ప్రతి సంవత్సరం ఒక కొత్త అవకాశంగా తీసుకుని ముందుకు సాగిపోవాలి

  • కష్టసుఖాల మధ్య జీవితం సమతుల్యంగా ఉండాలి. అతిగా ఉద్రేకపడక సమతుల్యం పాటించాలి.


✨ ముగింపు

ఉగాది కేవలం ఒక క్యాలెండర్ మార్పు కాదు… 
ఇది మనలోని మార్పుకు పిలుపు.

👉 జీవితం వికసించే కొత్త లక్ష్యాలు పెట్టుకోండి
👉 పనికిరాని పాత అలవాట్లు మార్చండి
👉 జీవితాన్ని ఆనందంగా ఆహ్వానించండి 
👉 సంతృప్తిగా బ్రతకటం, జీవితాన్ని ఆస్వాదించటం తెలుసుకోండి


“మీ జీవితం ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యంతో నిండాలి అని ఆకాంక్షిస్తూ  – ఉగాది శుభాకాంక్షలు!” 🌿

Comments

Popular posts from this blog

శ్రీరామనవమి శుభాకాంక్షలు

శ్రీరాముడు పురుషోత్తముడు అంటారు కదా. ఎందుకంటారు? ఆయనకు తిరుగులేదు అనా? కానే కాదు.  వాళ్ళ పినతల్లి వల్ల అడవుల పాలు ఐనా ఆమె కొడుకుని రాజుగా చేసినా విధిని మాత్రం వినమ్రత తో పాటించాడు. ఎవ్వరినీ పల్లెత్తు మాట అనలేదు. తండ్రి మాట కోసం సుఖంగా ఉన్న జీవితాన్ని త్యాగం చేసి కష్టాల బాట ఎంచుకున్నాడు. తన కర్తవ్యాన్ని పూర్తి శ్రద్ధతో, శక్తి యుక్తులతో నిర్వర్తించాడు. అందులో మనం తెలుసుకోవాల్సిన నిగూఢ రహస్యం ఏమిటంటే కష్టం లేకుండా జీవించడం గొప్ప విషయం కాదు. కష్టాల్లో ఉన్నా కూడా తన సౌమ్య శీలాన్ని, శక్తి యుక్తులను కోల్పోకుండా ఎలా ఉండాలో రాముడు మనకు చూపించాడు.  ఇది సత్యదూరం గా అనిపిస్తుంది మనకి. కానీ నిజం ఏంటంటే మనం మన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల ఇది సాధ్యం కాదు అని అనుకుంటాం. ఈ రోజుల్లో మన ఇంటినీ సుఖాన్ని వదిలి వెళ్ళమని ఎవరూ చెప్పట్లేదు కదా! జీవితం లో వచ్చే ఒడిదుడుకులు తట్టుకుని నిలబడే నిబ్బరం ఉండాలి అంతే! ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు వాడుకొని వదిలేస్తే అది బాధ. కానీ అలా జరగదు అని అనుకోవడం మన అమాయకత్వం. లోకంలో మనం తప్పు చేసినా భరించేది మన తల్లిదండ్రులే. ఇంకెవ్వరూ కనీసం మన కోసం మన కంటే ఎక్కువ ఆలోచించరు. అల...

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

యత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమంతి దేవతాః | యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలాః క్రియాః॥ - మను స్మృతి అధ్యాయం 3, శ్లోకం 56 మెదటి చరణం అందరికీ తెలిసిందే. ఆడవారు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని అర్థం. కానీ రెండో చరణం అర్థం మనుస్మృతి లో స్త్రీ కి ఉన్న గౌరవం, ప్రాముఖ్యత ఉటంకిస్తూ ఉంది. యత్రైతాస్తు న పూజ్యంతే = యత్ర + ఇతి + న + అస్తు + పూజ్యంతే = ఎక్కడ ఆమె పూజించబడదో సర్వాస్తత్రాఫలాః క్రియాః = సర్వః + తత్ర + అఫలాః + క్రియాః = అక్కడ ఏ పనీ ఫలించనట్టే. అంటే ఎక్కడ స్త్రీ గౌరవించబడదో అక్కడ ఏమున్నా, ఎంతున్నా నిష్ప్రయోజనం అని. స్త్రీ కి గౌరవం ఇవ్వండి అని చెప్పి ఊరుకోలేదు. ఆమెకు గౌరవం ఇవ్వని చోట ఇంకేమీ విలువైనది కాదు అని తర్కపూర్ణంగా ఉటంకిస్తూ చెప్పారు.  ఇది మన సంస్కృతిలో స్త్రీ యొక్క స్థానం. ముష్కర మూకలు మన మీద దాడి చెయ్యక ముందు కాలంలో స్త్రీకి అన్ని వ్యవహారాలలో అవకాశం, గౌరవం ఉండేది. స్త్రీ తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవటానికి నిర్ణయించుకున్నా, విద్య నుంచి యుద్ధం వరకు ఏ అంశంలో ఉండాలని నిర్ణయం తీసుకున్నా సమానమైన గౌరవం ఉండేది. వేదాలు వ్రాసిన వారిలో లోపముద్ర వంటి స్త్రీ మూర్త...