వెయ్యి అబద్ధాలు ఆడి ఐనా ఒక పెళ్లి చెయ్యాలి అని ఒక పాత నానుడి. ఇది నిజంగా మంచి చేస్తుందా? అసలు ఈ ఆలోచన మంచిదేనా?
పెళ్లి చెయ్యటం ఎంతో గొప్ప పనిగా భావిస్తాం. ఇది సమంజసం కావచ్చు. కానీ పెళ్లిళ్లు చెయ్యటానికి అబద్ధాలు చెప్పకూడదండీ. మీరు చెప్పిన అబద్ధాలు వాళ్ళ జీవితాలకు అవరోధం కావు అని మీరు భరోసా ఇవ్వగలరా? అబద్ధాల మీద ఆధారపడి కొత్త జీవితం ప్రారంభించే వారికి అది ఎంత పెద్ద అవరోధంగా మారుతుందో మీరు ఊహించగలరా? ఈ పోటీ ప్రపంచంలో ఎంత శ్రమ ఉందో మీకు తెలుసా? ఆ శ్రమకు మీరు ఆడిన అబద్ధాలు ఇంకెంత ఇబ్బందిని జోడిస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా?
ఒకప్పటిలో కుటుంబం చేసే వృత్తి పని చేసుకుంటూ ఇంటిలో అందరూ ఒక తీరుగా బ్రతికే వారు. ఒక కుటుంబంలో పుట్టిన వాళ్ళు అందరూ ఒకేలా ఉండకపోయినా సుమారు ఒకలా ఆలోచించేవాళ్ళు. కనీసం ఒకరి ఆలోచనలు ఒకరికి అర్ధం అయ్యేవి. వారి సామాజిక, ఆర్ధిక పరిణతి బట్టి వాళ్ళ జీవనం సాగించేవాళ్ళు. మానసికంగా బాగా పరిణతి సాధిస్తే ఇంకొంత మెరుగైన జీవితం పొందేవాళ్ళు. దీనికి భిన్నంగా కొన్ని ఉదాహరణలు లేకపోలేదు. కానీ ఎక్కువమంది వారి జీవితాన్ని మనోనిగ్రహంతో సాగించలేరు. వారి చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రకారం మారుతారు. వాళ్ళ జీవితం సుఖంగా ఉండటం వాళ్లకు ముఖ్యం.
ఇప్పుడు అందరూ ఒకే లాంటి బడిలో చదువుతున్నారు. ఒకే లాంటి సామాజిక పరిస్థితి లో బ్రతుకుతున్నారు. అలా అని అందరూ ఒకేలా ఉంటారు అని అనుకుంటే అంత కంటే అమాయకత్వం ఏమి ఉండదు. అలాగే ఉండాలి అనుకుంటే అంత కన్నా మూర్ఖత్వం కూడా ఇంకొకటి లేదు.
వివిధ కుటుంబ నేపధ్యం ఉన్న పిల్లలు స్నేహితులు అవుతారు. అందులో తప్పు ఏముంది అనిపిస్తుంది. కాబట్టి మనం ఆ స్నేహానికి ఆమోదం తెలుపుతాము. కానీ భిన్నమైన కుటుంబ నేపధ్యం ఉన్న పిల్లలు అటువంటి భిన్నమైన మనోభావాలు కలిగి ఉంటారు కదా! ఏది మంచి అని ప్రతి క్షణం అంచనా వేసుకుని ఎవరూ వాళ్ళ జీవితాలని గడపరు. వాళ్ళ పరిణతి బట్టి మంచి చెడుల మధ్య వ్యత్యాసం వేరు వేరు గా ఉంటుంది.
కుటుంబ సంప్రదాయాలకు ఒకప్పుడు ఉన్నంత ప్రాధాన్యత ఇప్పుడు లేదు. కుటుంబ వ్యవస్థ యొక్క గౌరవం అవసరం తీరేవరకే. ఆ తరువాత వాళ్ళకు ఎలా వీలుంటే అలా, ఎలా అనువుగా ఉంటే అలా, ఎవరికి ఏమి తోస్తే అది చేస్తున్నారు. తల్లిదండ్రులు చెప్పే మాటలు చెవిన వేసుకోరు. యుక్త వయస్సు వచ్చాక ఇంక సరే సరి. అమ్మానాన్నా చెప్పేది పాత చింతకాయ పచ్చడి. మన సినిమాలు ఇలాగే చూపిస్తాయి. ప్రసార మాధ్యమాలు కూడా ఇదే దిశ గా నడుస్తున్నాయి. జీవితం అంటే రోటీ కపడా మకాన్. ఇది దాటి ఎవ్వరూ జీవితం గురించి ఎవరికీ ఏమి చెప్పటం మానేశారు.
అందరూ సమానం అనే ఒక మానసిక చట్రం మినహా పాఠశాలల్లో గానీ కళాశాలల్లో గానీ మంచి చెడూ వివరించేలా పాఠాలు ఏమి ఉండవు. కుటుంబ విలువల గురించి గానీ, సామాజిక పరిణతి గురించి గానీ, ఆర్ధిక పరిణతి గురించి గానీ, మానసిక పరిణతి గురించి గానీ ఎలాంటి పాఠాలు మనకు నేర్పే పరిస్థితి లేదు. ఈ విషయం తప్పుబట్టను. ఎందుకంటే పాఠశాలలు, కళాశాలలు అందరికీ సర్వసామాన్యంగా ఉండే అవసరాల కోసం నిర్మించబడ్డ వ్యవస్థలు. కుటుంబం లోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఏమీ చెప్పే సామర్ధ్యం వీటికి ఉండదు. ఎందుకంటే ప్రతి కుటుంబం నుండి అధ్యాపకులు ప్రతి పాఠశాల లో, కళాశాలలో ఉండే అవకాశం లేదు కాబట్టి.
నేను మాట్లాడుతున్నది కులాలకు ఆపాదించుకునేరు. నా ఉద్దేశ్యం అది కాదు. నేను చెప్పేది సూటిగా చెప్తున్నాను. ఎదో చెప్పాలని ఇంకేదో చెప్పే ప్రయత్నం చెయ్యటం లేదు. మీరు ఇది గమనించాలి.
ఒక్కో వ్యక్తి తన జీవితాన్ని తన మానసిక పరిణతి వల్ల, పరిస్థితుల వల్ల, తారసపడిన ప్రభావాల వల్ల, ఇంకెన్నో క్లిష్టమైన సమీకరణాల వల్ల కుటుంబ విలువలకు చాలా దూరంగా ఒక కొత్త వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడం జరుగుతుంది. ఒక కుటుంబంలో పుట్టిన ఏ ఇద్దరు వ్యక్తులు ఒకలా ఆలోచిస్తారు అనే భరోసా లేదు. అలాంటి వ్యక్తులకు మీరు కాండక్ట్ సర్టిఫికెట్ ఎలా ఇస్తారు? అది నిజంగా ఎంత నిర్దిష్టంగా ఉంటుంది? ఎంతవరకు ఉపయోగపడుతుంది?
కొంతమంది, పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మాయిని, అబ్బాయిని ఒకదగ్గర కూర్చోబెడితే మాట్లాడుకుంటారు అనుకుంటున్నాం. కానీ వాళ్ళ జీవితం గురించి వాళ్ళు ఏమి తెలుసుకున్నారు? వాళ్ళ జీవితం గురించి నిర్ణయం వాళ్ళు తీసుకోగలరా? వాళ్లకు ఆ పరిణతి ఉందా? ఈ విషయాలు మనం అంతగా ఆలోచించము. పెద్దవాళ్ళు అయ్యారు కదా, వాళ్లకు తెలీదా అంటాము. చాలా మందికి వాళ్లకు ఏమి కావాలో తెలీదు. వాళ్లకు ఇది తెలియటానికి జీవితం అంటే వాళ్లకు ఏమి నేర్పించారు చెప్పండి?
వివాహం అనేది ఒకరి కోసం ఒకరు జీవితకాలం కష్ట సుఖాలలో కలిసుంటాం ఒకరికి ఒకరు ఆసరాగా నిలుస్తాం అని చేసుకునే ప్రమాణం. అసలు ప్రమాణానికే విలువ లేని ఈ రోజుల్లో ఆ అర్ధం తెలియని ప్రమాణం విలువ ఎందరికి తెలుస్తుంది? ఎందరు దాన్ని నిలబెట్టుకుంటారు? అలా అని పెళ్లి చేసుకోకుండా బ్రతికే పరిణతి ఉందా అంటే అదీ లేదు. కష్టం వస్తే వదిలేస్తాను అంటారు. కష్టపడుతూ ఎందుకు కలిసి బ్రతకటం? విడిపోయి సుఖంగా ఉండవచ్చుకదా? ఇది కూడా ఆ క్షణానికి సరైనదే అనిపిస్తుంది. కానీ జీవితంలో తోడు లేకుండా బ్రతకటం అంత సులభమా? దానికి ఎంతో పరిణతి కావాలి. మరెంతో ఓర్పు కావాలి.
ఒకరికి ఒకరు తోడుగా ఉండే జీవితం చాలా అందంగా ఉంటుంది. కానీ అలా ఉండగలిగేవాళ్ళు పెళ్లి చేసుకుంటేనే ఆ అందం ఇనుమడిస్తుంది. లేదంటే మూన్నాళ్ళ ముచ్చటగా మిగిలిపోతుంది.
కాబట్టి పెళ్లి చేసుకునే ముందు అందరూ ఒక సారి వాళ్ళగురించి, వాళ్లకు కావలసిన తోడు గురించి తెలుసుకునేందుకు సమయం వెచ్చించాలి. ఎలాంటి విశయాల గురించి ఆలోచించాలి అనుకుంటున్నారా?
స్నేహం పెళ్లికి మూలం
స్నేహం అన్ని బంధాలలోనూ ఉంటుంది. దండలో దారంలాగా, కనిపించకపోయినా బంధం అనే పదానికి నిజమైన అర్ధం అదే. బంధాలన్నిటికీ పునాది రాయి, ఇటుకలు (బిల్డింగ్ బ్లాక్స్) స్నేహమే. బంధం ఎంత పెద్దదైనా అందులో స్నేహం లేకపోతే ఆ బంధం పేక మేడలా కుప్పకూలిపోతుంది.
తల్లికీ బిడ్డకీ, తండ్రికీ బిడ్డకీ, అక్కకీ చెల్లికీ, అన్నకీ తమ్ముడికీ, అమ్మమ్మకీ మనవలకీ, ఇలా ఏ బంధం చూసినా స్నేహం అంతర్లీనంగా ఉంటుంది.
స్నేహాన్ని నిర్వచించాలంటే - ప్రతి బంధం లో అంతర్లీనంగా ఉండే ఇచ్చే గుణం. నువ్వు, నేను వేరు కాదు అనే భావన. నా దగ్గర ఉన్నది నీకు కావాలంటే నీదే అనే భావన. ఈ గుణం నుండే ఉత్సాహం, ఉల్లాసం, ఆనందం ఉత్పన్నమౌతుంటాయి.
ప్రతి స్నేహం ఒక చిన్న అడుగు తో మొదలౌతుంది. అడుగులు పడుతూ వెళుతూ విడదీయని బంధంగా మారుతుంది.
పెళ్లిలో చేసే ప్రమాణాలు
పెళ్లిలో చేసే ప్రమాణాలకు అర్ధం తెలుసుకుందాం. అక్కడ నుండి ఇతర వివరాలలోకి వెళ్లవచ్చు. ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ నాతిచరామి అనే ఈ ప్రమాణానికి అర్ధం తెలుసుకుంటే మనం ఏ విషయాల పట్ల శ్రద్ధ పెట్టాలో అర్ధం అవుతుంది. ధర్మం, అర్ధం, కామం, మోక్షం - వీటిని చతుర్విధ పురుషార్ధాలు అంటారు. జీవితంలో మనం కోరుకునే అన్నీ ఈ నాలుగు మాటలలో ఇమిడి ఉంటాయి. ఒక వ్యక్తి జీవితం సంతోషంగా / ఆనందంగా ఉండాలి అంటే ఈ నాలుగు పురుషార్ధాలు (కరెన్సీలు) ఉండాలని మన సంస్కృతిలో గుర్తించారు.
ధర్మం అంటే సాంప్రదాయాలు అని ఒక అర్ధం, వ్యక్తి యొక్క సహజగుణం అని ఇంకొక అర్ధం. ఈ రెండు అర్ధాలను కాస్త విపులంగా చూద్దాం.
సాంప్రదాయాలు అంటే ముందు తరాలు వాళ్ళకు ఉపయోగపడిన ఉపాయాలు మన మీద ప్రేమతో మనకు అందించిన పాఠాలు. కటువుగా ఉన్నా మన జీవితానికి మేలు చేసేవి సాంప్రదాయాలు. నాన్న ప్రేమ లాగా! సాంప్రదాయాలు సర్వజనీనమైనవి అయి ఉండవచ్చు, లేదా కుటుంబానికే ప్రత్యేకమైనవి కూడా అయి ఉండవచ్చు.
కుటుంబానికే ప్రత్యేకమైన సాంప్రదాయాలని కుటుంబ సాంప్రదాయాలు అనవచ్చు. కుటుంబ సాంప్రదాయాలు ఎలా ఏర్పడి ఉంటాయో సునిశితం ఆలోచిస్తే అర్ధం చేసుకోవచ్చు.
మానసికంగా మనకు కుటుంబం అంటే చాలా అర్ధాలు ఉండవచ్చు. కొందరికి కుటుంబం అనగానే ఎక్కడ లేని నీరసం వచ్చెయ్యొచ్చు. కానీ మనలో చాలామందికి కుటుంబం అంటే మన సర్వస్వం. దానికోసం మనం ఏదైనా చేస్తాం. దానికోసమే- ఏ..దైనా చేస్తాం. కొన్నిసార్లు మంచి చెడు ఆలోచించకుండా ఏది అవసరమో అది చేసేస్తాం.
ఐతే, జీవ శాస్త్ర పరిభాషలో చెప్పుకుంటే కుటుంబం అంటే జన్యుసంబంధమైన వ్యక్తుల సమూహంగా చెప్పుకోవచ్చు. జన్యుసంబంధం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే - ఆరోగ్యం, అనారోగ్యం నిర్ణయించేది జన్యువులే కదా! మానసిక స్థితిని కూడా జన్యువులు బాగానే ప్రభావితం చేస్తాయి. మానవ జీవవ్యవస్థ సైకోసోమాటిక్ వ్యవస్థ అంటారు. మీకు తెలిసే ఉండవచ్చు! మానసిక, శారీరక పరిస్థితులు రెండూ మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి. వాటిని సవ్యమైన దారిలో నడిపించేవే పద్ధతులే సాంప్రదాయాలు.
మన పూర్వీకులు కుటుంబంలో పిల్లని చేసుకునేందుకు చాలా ప్రయత్నించేవాళ్లు. తద్వారా జన్యుపరంగా కుటుంబంలో సాంప్రదాయాలకు సరిపోయే అమ్మాయిని కుటుంబంలోనికి తెచ్చుకుని ఆమె ఆరోగ్యం కూడా బాగుండేలా చూసుకునేవాళ్లు. అలాగే సాంప్రదాయాలు సరిపోయే అమ్మాయికి కొత్తగా వచ్చిన ఇంట్లో ఇమిడిపోవటం సులభం అయ్యేది.
ఆమె గురించి కుటుంబంలో అప్పటికే తెలుసు కనుక ఆమె ప్రవర్తనను సహజంగా అర్ధం చేసుకునే అవకాశం ఉండేది. బంధువుల ఇంటికే వెళ్లటం వల్ల ఆమెకి కూడా ఎదో తెలియని ప్రపంచంలోనికి వెళ్లిన ఇబ్బంది తక్కువగా ఉండేది.
ఇప్పటి కాలంలో మనం సైన్సుకు ఇచ్చిన విలువ కుటుంబానికీ, సాంప్రదాయాలకు ఇవ్వటం లేదు. దీనికి కారణం మన విద్యా విధానం, దాన్ని ఉనికిలోనికి తెచ్చిన వాళ్ల లక్ష్యాలు - పాశ్చాత్య విధానం ఏదో గొప్పది గా చూపించాలనే తాపత్రయం. వాళ్లు వాళ్ల లక్ష్యం నెరవేర్చుకున్నారు. మనమే ఎటూ కాకుండా మిగిలిపోతున్నాం. వాళ్లకు కావాల్సింది కూడా అదే కదా!
కుటుంబం అంటే మనం ఏదైనా అంచనాకు వచ్చే ముందు మనం మన సామాజిక ఆర్ధిక పరిస్థితులు పరాయి పాలనలో ఎలా చతికిలబడ్డాయో గుర్తు పెట్టుకోవాలి. కొన్ని తరాల వెనక్కి వెళ్లి ఆలోచించాలి. ఈనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే వార్తాపత్రికలు ఏమి చెప్తే ప్రపంచం అలా ఉంది అని మనందరం అనుకుంటున్నాము.
నిజం ఏమిటంటే సమాజంలో సర్వసాధారణమైన విషయాలు వార్తాపత్రికలు వ్రాయవు. కేవలం అసాధారణ వవిషయాలు మాత్రమే వ్రాస్తాయి. కుటుంబం కోసం కష్టపడే ఒక సామాన్యుడి కధ ఏ వార్తాపత్రిక కవర్ చెయ్యకపోవచ్చు. కుటుంబం కోసం ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా పని చేసే మహాతల్లులు వార్తాపత్రికలకు సాధారణం కావచ్చు. కానీ సగటు కుటుంబంలో నిజమైన చిత్రం ఇదే. ఇలాంటి వాళ్ళగురించి వ్రాస్తూ పోతే ఏ వార్తాపత్రికా సరిపోదని కాబోలు!
వార్తలు చూసి అత్త అంటే కోడలిమీద కనికరం లేకుండా ఉంటుంది కాబట్టి కోడలు గడుసుగా ఉండాలి. కోడళ్ళు గడుసుగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి. భర్త భార్యని నిర్లక్ష్యం చేస్తాడు కాబట్టి భార్య తన జాగ్రత్తలో తను ఉండాలి, మగవాళ్ళు చెడ్డవాళ్లు. భార్యలు అణకువగానే ఉండాలి. అసలు ఇవన్నీ నిజం అయితే అసలు పెళ్లిళ్ళు ఎందుకు చేసుకోవాలి? ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకటం ఉత్తమం కదా! అందుకే ఇలాంటి prejudiced మనస్తత్వం మానుకోవాలి.
మగవాళ్లు - మీ అక్కా చెల్లీ తల్లీ స్త్రీలు అని గుర్తు పెట్టుకోండి. అమ్మాయిలు మీ అన్నా తమ్ముడూ తండ్రి కూడా మగవాళ్ళే అని గుర్తు పెట్టుకోండి. మగవాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు అయితే మీ తండ్రి మిమ్మల్ని అల్లారుముద్దుగా పెంచి ఉండకూడదు కదా! ఆడవాళ్ళు అందరూ గడుసువాళ్ళు అయితే మీ అమ్మ మిమ్మల్ని ప్రేమించి పెంచేది కాదు కదా!
ఇంత చెప్పినా మీ మనసు అవతలి వాళ్లు మంచిగా ఉంటారు అనే విషయం ఒప్పుకోలేదు అనుకుంటే దయచేసి పెళ్లిళ్ళు చేసుకోకండి - అవతలి వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి. అందులో మీరు పొందే ఆనందం కూడా ఏమీ ఉండదు.
ఇదీ సాంప్రదాయాల కధ.
వ్యక్తి యొక్క సహజగుణం గురించి ఇప్పుడు కాస్త చూద్దాం. ఈ విషయం గురించి మాట్లాడుకునేటప్పుడు మనం సహజంగా చూసే మంచి, చెడు అనే ఫిల్టర్స్ తీసేసి చూడవలసి ఉంటుంది. ప్రతి వ్యక్తికి సహజంగా ఒక వైఖరి ఉంటుంది. అపరిమితమైన స్వేచ్చ ఉంటే ఒక మనిషి ఎలా ఉంటాడో అదే అతని సహజ గుణం. దాన్ని నిర్బంధించే ఎలాంటి కట్టుబాటు అయినా అతనికి / ఆమెకు ప్రతిబంధకం. మంచి, చెడు భేదం లేకుండా ఏది సహజ గుణం, ఏది ముఖ్యం, బలాలు, బలహీనతలు, దాతృత్వం, ఉదాత్త హృదయం, కోపం, ఆవేశం, అసూయ, నిస్సహాయత. అన్నీ!
సహజ గుణం సమాజంలో కట్టుబాట్లకు లోబడి ఉండాలి. కానీ దాన్ని ఎప్పుడూ కట్టేసే ఉండాలంటే వాళ్ళకు ఊపిరి ఆడని పరిస్థితి ఉంటుంది. అలాంటి సహజ గుణాలు ఏవైనా సరే, ఎలాంటివైనా సరే, పెళ్లికి ముందు ఖచ్చితంగా చెప్పి తీరాలి. మందు అలవాటు ఉంటే, సిగరెట్ కాల్చే అలవాటు ఉంటే, ఇతరులతో శారీరక సంబంధం ఉంటే, అది కొనసాగించే ఉద్దేశ్యం ఉంటే, ఏదైనా నయం కాని రోగం ఉంటే, ఏదైనా ప్రగాఢమైన విశ్వాసం ఉంటే, ఏదైనా గాఢమైన కోరిక ఉంటే, అపరిమితమైన ఇష్టం ఉంటే, అపరిమితమైన ద్వేషం ఉంటే, ఇలా ఏదైనా గాఢమైన ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే వివాహానికి ముందే వ్యక్తం చేస్తే తరువాత మిమ్మల్ని తప్పుబట్టే అవకాశం ఎవరికీ ఉండదు.
ఇలా వ్యక్తపరిచిన విషయాలు ఇరువైపులా ఆమోదం ఉంటేనే వివాహం గురించి ఆలోచించాలి. లేదంటే లేదు. ఏదో అమ్మాయి బాగుంది / అబ్బాయి బాగున్నాడు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, కులం గోత్రం కుదిరింది లాంటి పైపై మెరుగుల కోసం పెళ్లి చేసుకుంటే - అందం, ఆస్తి కరిగిపోతాయి. గుణమే మిగిలి ఉంటుంది. దానితో రాజీ పడలేకపోతేనే జీవితం మీద విరక్తి, నిరాసక్తి, నీరసం, దీర్ఘకాలిక రోగాలు, బాధలు, భయాలు. బంధం కాస్తా బంధకంగా మారుతుంది, చెరసాలగా తోస్తుంది. చావాలనిపిస్తుంది. చంపాలనిపిస్తుంది. విడాకులు తీసుకోవాలి అనిపిస్తుంది. ఈ లోపు పిల్లలు పుట్టి ఉంటే వాళ్ల గతి ఏమిగాను? తల్లిదండ్రులు తన్నుకు ఛస్తుంటే పిల్లలకు కుటుంబం విలువ ఏం అర్ధం అవుతుంది? అసలు జీవితం అంటే ఉత్సాహం ఏమి ఉంటుంది? కొట్టుకు చావటానికి పెళ్లి చేసుకోవటం దేనికి? డబ్బులు దండగ! కుటుంబంలోని అందరికీ మనశ్శాంతి లేకుండా చేసి ఇందరినీ బాధ పెట్టే కంటే అలాంటి పెళ్లి చేసుకోకపోవటం మేలు కదా!
అందుకే మీ నిజస్వరూపం మీరు పెళ్లి చేసుకునే ముందు అవతలి వాళ్లకు చెప్పండి. అవతలి వాళ్ళ నిజస్వరూపం మీరు పూర్తిగా తెలుసుకోండి. ఇద్దరికీ కలిసి జీవించటం ఇష్టమైతేనే పెళ్లి చేసుకోండి. ఇద్దరూ కలిసి ఒకరికి ఒకరు తోడుగా మంచి కుటుంబాన్ని నిర్మించుకోండి. ఒకరి బలహీనతకు ఒకరి బలాన్ని అడ్డుపెట్టి, కష్టసుఖాలు కలిసి మెలిసి పంచుకుని ఆనందంగా జీవించండి. ఒకరి గెలుపు మరొకరికి ఆనందం ఇవ్వాలి. ఒకరి కష్టంలో మరొకరు ఓదార్పుగా, చెలిమిగా, కలిమిగా, నిండుగా, పండుగలా జీవితం గడపండి.
అర్ధం అంటే ధనం / సంపద / ఆస్తులు అని అర్ధం. పెళ్ళైనప్పటి నుండి నాది, నీది అనే మాట లేకుండా, ఉన్నది ఏదైనా ఇద్దరిదీ, సంపద అయినా, కుటుంబమైనా, బరువైనా, బాధ్యత అయినా, ఏమి ఉన్నా లేకున్నా మనం అనే భావం లోని మాధుర్యం అనుభవించాలి. వీలైనంత ఎక్కువ సంపాదించాలి. వీలైనంత ఒద్దికగా దాచుకోవాలి. ఒకరి కుటుంబానికి ఒకరు విలువ ఇవ్వాలి. ఉన్నదానిలో సంతృప్తిగా బ్రతకాలి.
కామం అంటే కోరిక అని సహజమైన అర్ధం. శృంగారం అని కూడా అర్ధం ఉంది. నిజానికి శృంగారం కూడా ఒక రకమైన కోరికే కదా.
కామం అంటే కోరిక అని అర్ధం. అందులో మీ జీవితాశయాల నుండి, చిన్న చిన్న సంతోషాల వరకు అన్నీ ఉంటాయి. కోరిక ఏదైనా సరే - సమాజానికి, కుటుంబానికి చేటు చేసేది కానంతవరకు, కుదిరినంతలో తీర్చుకోవాలి. పేరుకుపోయిన కోరికలతో పోతే మళ్లీ ఇంకో జన్మ ఎత్తి మళ్లీ మొదలు పెట్టాలి అంటారు మన పెద్దలు.
శృంగారం వివాహం లో భాగం. భాగస్వామి కోరిక తీర్చటం ఒక బాధ్యత కూడా. అలా అని హద్దు పద్దు లేకుండా ఎప్పుడంటే అప్పుడు అడగటం కూడా సమంజసం కాదు. ఒక సమతూకం ఉండాలి. ఆరోగ్య పరిస్థితులు, వ్రతాలు, పూజలు, కుటుంబ పరిస్థితులు, అవకాశాలు అన్నీ చూసుకుని గుట్టుగా అనుభవించవచ్చు. ఇద్దరూ సమ్మతంగా, సన్నద్ధంగా ఉంటే ఇద్దరికీ అది ఒక మధురానుభూతిని అందిస్తుంది. లేదంటే పాశవికంగా ఉంటుంది. ఒకరంటే మరొకరికి వల్లమాలిన ప్రేమ, గౌరవం, అభిమానం ఉన్నప్పుడు ఇది అందంగా ఉంటుంది. ఆ ప్రేమా, గౌరవం లేనప్పుడు వికృతంగా ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో ఇంతకు మించి చెప్పటం సమంజసం కాదు.
మోక్షం అంటే అదేదో ముసలివాళ్ళకు సంబంధించిన విషయం అనుకుంటున్నారు. మోక్షం అంటే ఇంకొక అర్ధం ఉంది - పరిస్థితుల ప్రభావాలకు లోబడని స్థితి. ఏది అవసరమో అది సమర్ధవంతంగా చెయ్యగలిగే ఒడుపు.
కేవలం మానవ జన్మకే సాధ్యమయ్యే అతి కొద్ది అవకాశాలలో మోక్షం ఒకటి. కొన్ని జంతువులు కూడా మోక్షం పొందిన సంఘటనలు మన పురాణాలలో లేకపోలేదు, కానీ ఎక్కువగా మానవ జన్మలోనే సాధ్యమయ్యేది ఈ మోక్షం. పరిస్థితులకు అవసరమైనట్టు మనసుని నిగ్రహించుకోవటం, ఏది అవసరమో అది చెయ్యగలగటం ఒక రకమైన మోక్షం. ఈ మోక్షం పొందటానికి చనిపోవలసిన అవసరం లేదు. చనిపోయినప్పుడు మోక్షం పొందటం కంటే బ్రతికి ఉండగా మోక్షం సాధించటం ఇంకా గొప్ప విషయం. ఇందుకు మనసు పైన చాలా పట్టు సాధించాలి. అందుకు ప్రశాంతమైన పరిస్థితులలో సాధన చెయ్యాలి. అందుకు ఒకరికి ఒకరు సహకరించుకోవాలి.
Comments
Post a Comment