నేను సినిమాలు
చాలా తక్కువ చూసేవాడిని. సినిమా అంటే టైం వేస్ట్ అనుకునే నేను, కారణాలు ఏవైనా, ఈ మధ్య ప్రతి వారం ఏదో ఒక్క సినిమా అయినా
చూస్తున్నాను. ఇప్పుడు సినిమాని మరో కోణంలొ నుండి చూస్తున్నాను. ఆ కోణమే మీ తో
పంచుకోవాలని అనుకుంటున్నాను.
సినిమా మన అందరి
జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మన మనసుని స్పృశించే ఉంటుంది. ప్రతి సినిమా ఒక కొత్త
కధ. ఇలా ఎన్ని కధలు పుడుతున్నాయో కదా? ఇవి ఎలా పుడుతున్నాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? కాలానికి తగ్గట్టు ప్రాంతానికి తగ్గట్టు,
పరిస్థితులకు తగ్గట్టు
కొత్త సినిమాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ కధలన్నీ ఎలా పుడుతున్నాయి? ఎందుకు పుడుతున్నాయి? ఇలా నా ఆలోచనలు సాగుతున్నాయి.
అసలు కధ మొదటి
సారి ఎందుకు అవసరం పడిందో ఆలోచిస్తే నాకు ఒక ఆలోచన తట్టింది. మా అబ్బాయికి ఏదైనా
కొత్త విషయం చెప్పాలనుకున్నప్పుడు, వాడి ఆలోచనలను
మార్చాలనుకున్నప్పుడు నేను వాడే పరికరం కధ. ఆ కధ అంతకు ముందు ఎప్పుడూ ఎవరూ చెప్పి
ఉండరు. ఆ తరువాత నాకు కూడా గుర్తు ఉండకపోవచ్చు. కానీ ఆ సమయానికి నాకు బాగా
ఉపయోగపడే చక్కటి సాధనం కధ.
బాగా గమనిస్తే
కధకు మన మనసుకూ ఒక
చక్కని సంబంధం ఉంది. కధ వినేటప్పుడు మనం మన ఎమోషన్స్ / జడ్జ్మెంట్ పక్కన
పెట్టేస్తాం. ఎందుకంటే కధ వల్ల మన జీవితానికి ఎలాంటి అపాయం ఉండదు.
కధ వినేటప్పుడు
కధలోని పాత్రల ఆలోచనలని మనం అనుభవిస్తాం. కధానాయకుడు లేదా కధానాయిక పాత్రలో మనం
పరకాయ ప్రవేశం చేసేసి వాళ్ళ సంతోషాన్నీ బాధనీ మనం అనుభవిస్తాం. కధ రసవత్తరంగా
ఉన్నప్పుడు ఎవరైనా మనని కదిలిస్తే చికాకు పడిపోతాము కూడా. మన మనసుని ఇంతగా
ప్రభావితం చేసే కధ గురించి మనం తెలుసుకోవాలి కదా!
మనిషి సంఘజీవి
అంటారు కదా! మనిషి మనస్సుకు తన చుట్టూ ఉన్న పరిస్థితులతో సానుభూతి పొందటం సహజమైన
లక్షణం. (సానుభూతి = స + అనుభూతి -> సవర్ణ దీర్ఘ
సంధి. బహుశా ఈ పదప్రయోగం ఇలాగే మొదలయి ఉండ వచ్చు. నిస్సహాయుల పరిస్థితికి మనం సానుభూతి చూపించటం
అంటే వాళ్ళ ఆలోచనను సమర్ధించటం. అంతే కదా?) ఇతరుల జీవితాలలోని
పరిస్థితులకు అనుగుణంగా ప్రతిస్పందించటం, వారి తరపున ఆలోచించి సలహాలను ఇవ్వటం కూడా మనకు సహజ లక్షణం.
ఈ సానుభూతి అనే
మానసిక పరికరం మనకు చిక్కులు తెస్తుంది, తీరుస్తుంది కూడా. ఏదైనా క్లిష్టమైన పరిస్థితి మనకు ఎదురైతే మనస్సు చాలా
గాఢమైన సంవేదనకు గురి అవుతుంది. ఆలోచన స్థిమితంగా ఉండదు. భయం, కోపం లాంటి సంవేదనలు మన మనసుని శాసిస్తాయి. కధలను
విన్నప్పుడు అదే పరిస్థితిని తృతీయ తత్పురుషం లో మనసు కుదురుగా ఆలోచిస్తుంది.
అందుకే మన సమస్యను మనం పరిష్కరించుకోలేకపోయినా అవతలివాళ్ళ సమస్యలకు మనం చక్కని
పరిష్కారాలు ఇవ్వగలుగుతాం.
కధలతో మన సమస్యను
మనకే తృతీయ తత్పురుషంలో ఎవరైనా వివరిస్తే మన సమస్యలకు మనమే సమాధానం వెతుక్కోగల
అవకాశం దొరుకుతుంది. మన కంటే తెలివైన మన ఆత్మీయులకు కూడా ఈ పద్ధతి ఉపయోగించి మనం
సహకరించవచ్చు.
కధలో వివరాలు నిజ
జీవితంలో అంత ఎక్కువ ఉండకపోవటం సహజం. ఎంత ఎక్కువ వివరాలు కధలలో ఉంటే కధ అంత
పెద్దది అవుతుంది. కధ లోని వివరాలు అవతలివాళ్ళకు సానుభూతి కలిగించలేకపోతే ఆ కధ
యొక్క లక్ష్యం నెరవేరకపోవచ్చు. కనుక కధలో ఎంత వివరం అవసరమో అంతే ఉంచాలి.
ప్రచురించే కధలు
వ్రాయటం, సినిమాలు తియ్యటం
మరో స్థాయి పని. అలాంటి కధలు ఎవరికీ పూర్తిగా అన్వయం కావు. కానీ కధలో
చెప్పాలనుకునే విషయం ఖచ్చితంగా ఉపయోగ పడేదే అయి ఉంటుంది. కధ చదివినప్పుడు గానీ
సినిమా చూసినప్పుడు గానీ పాఠకులు / ప్రేక్షకులు సానుభూతిని పొందలేకపోతే ఆ కధ లేదా
చిత్రం విఫలమవుతుంది. కనుక కధను రక్తి కట్టించేలా చెప్పవలసిన అవసరం ఉంటుంది. దాని
కోసం సమకాలీన అంశాలు కధలో ఇమిడ్చి మరింత సరదాగా లేదా సానుభూతిని కలిగించేలా
మలచవలసి ఉంటుంది. కధలో ప్రతి విషయం నిజం కాదు. కానీ దాన్ని పాఠకులు / ప్రేక్షకులు
అనుభూతి చెందగలిగితే కధ యొక్క అవసరం తీరినట్టే.
కధ వ్రాయటం
సృజనాత్మకమైన కళ. ఒక మంచి విషయాన్ని అవతలి వాళ్ళకు చేర్చే అధ్బుతమైన ప్రక్రియ. కధ
లోని ప్రతి మాట ఎంతో మంది మనసుల్లో చెరగని ముద్ర వేసే శక్తి కలిగి ఉండాలి. మంచి
కధలు చదివినప్పుడు అవి మన మనసుకు సన్నివేశాలని కళ్ళకు కట్టినట్టు వివరిస్తాయి. ఎంత
హృద్యంగా వ్రాస్తే అంత ఎక్కువ గాఢమైన అనుభూతిని అందించ గలుగుతాము.
అలాంటి కధని
తెరకెక్కించాలంటే ఇంకా చాలా వివరాలు పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది. కధ తో పాటు
సన్నివేశాలు సాక్షాత్కరించేలా చెయ్యాలి. అందుకు మాటలు, మాండలికాలు, ప్రొనౌన్సియేషన్, అభినయం, చాయాగ్రహణం, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ఇన్నీ సమకూర్చే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్
కావాలి. ఇవి కాక - చూసేటప్పుడు ప్రేక్షకులకు మరింత గాఢమైన అనుభూతిని అందించేందుకు
లైటింగ్, నేపధ్య సంగీతం,
కధను వేగంగా ముందుకు
నడిపేందుకు, పాత్రల మనోభావాలు
తక్కువ సమయం లో వ్యక్తీకరించటానికి, పాటలు, వాటి కోసం పాటల
రచయిత, సంగీతం, సంగీత దర్శకత్వం, కళాకారులు చూడముచ్చటగా ఉండటం కోసం కాస్ట్యూం
డిపార్ట్మెంట్, ఇలా ఇన్ని రకాల
కళాకారులు కలిసి కొన్ని నెలలు తపస్సు చేస్తే వచ్చే ఫలం 2 గంటల నిడివి గల చలనచిత్రం.
ఈ కష్టం
గుర్తించాను కనుకనే సినిమాని మరింత శ్రద్ధతో, గౌరవంతో చూడటం మొదలుపెట్టాను. కధా రచయితలకు,
సినిమా కళాకారులందరికీ ఈ
సందర్భంగా నా గౌరవపూర్వకమైన, హృదయపూర్వకమైన
అభినందనలు.
Comments
Post a Comment