Skip to main content

నా మెయిలు లో తెలుగు వెలిగిపోతుంటేను

 నా మెయిలు లో తెలుగు వెలిగిపోతుంటేను...

తెలుగు వెలుగులు దిగంతాలు దాటేను ...
 
నా కలలు నిక్కముగ చూసుకుంటున్నా...
తెలుగు తల్లి పదముల మొక్కి, బాసలు చేసుకుంటున్నా..
 
తెలుగు లో ఈ మెయిలు వ్రాసుకుంటున్నా....
 
లాలి పాటల తెలుగు       పొలము పాటల తెలుగు
చదువు సంధ్యల తెలుగు       శౌర్య చేతన తెలుగు
మదికి సాంత్వన తెలుగు       మధుర లాలన తెలుగు
మరులు గొల్పెడు తెలుగు     మమత తెలుగు

రత్నాలు పొదిగిన తెలుగు రాచ తెలుగు
కృష్ణ రాయల కీర్తి గాంచె తెలుగు
రవి చెందురుల ఆయువున్న తెలుగు
కవి త్రయము కూర్చిన భారతము తెలుగు
అన్నమాచార్యుని పదము తెలుగు
త్యాగరాయుని కృతుల సిరులు తెలుగు
పోతన్న భాగవతము కాంచిన వెలుగు
శ్రీనాధ ప్రబంధముల మెరిసె జిలుగు
కీర్తించ లేనంత వరము తెలుగు
మాటే తానైన మమత తెలుగు
  
కవితలూరు తెలుగు కమ్మదనము
విరుల ఝరుల తెలుగు సౌరభమ్ము
 
పాల మీగడ తెలుగు    తేనె తీపియు తెలుగు
గోదావరీ నీళ్ళ     గల గలలు తెలుగు
 
విన సొంపగు విజ్ఞాన కోశము తెలుగు
రాచ మర్యాదలు పొందు రాచ తెలుగు
 
ఇంకా కవితా ఝారి వరద లా పొంగుకొస్తోంది...
కానీ ఈ వరద మీ కంప్యూటర్లని ముంచేస్తుందేమో అని...
నాగార్జున సాగర్ అంత ఆనకట్ట వేసి ఆపుకున్నా..
 
నా తెలుగుని ఇలా జగద్విఖ్యాతం చేసిన జిమెయిల్ టీం మరియు గూగుల్ సంస్థకు నా హృదయపూర్వక ధన్యవాదములు
 
ఏంటో... ఇదంతా చదివి మీరు ఏమయిపోతారో అని బెంగ గా వుంది :)
తిరుగు టపా త్వరగా పంపితే చదివి సంతోషిస్తాం ;)
మర్చిపోవద్దు... తెలుగు లో వ్రాయండి....
 
ప్రేమ తో,
మీ
వంశీ కుంచాల

ఇది వ్రాసి చాలా ఏళ్ళయ్యింది. జిమెయిల్ లో తెలుగు మొదలయిన రోజులవి (ఏప్రిల్ 2009)
అప్పటి నుండి అనుకుంటే ఇప్పటికి నా బ్లాగుకు ఒక రూపం వచ్చింది.

Comments

Popular posts from this blog

🌿 ఉగాది పండగ - ఎందుకు, ఏమిటి, ఎలా?

  ఉగాది అంటే కేవలం ఒక పండుగ కాదు… ఇది కొత్త ఆలోచనలకు, కొత్త ఆశలకు, కొత్త జీవనానికి ప్రారంభం. ఉగాది  - యుగాది అనే పదం నుండి వచ్చింది. “యుగాది” అంటే  “యుగం + ఆది” — అంటే కాలానికి ఆరంభం అని అర్ధం . తెలుగు ప్రజలకు ఇది నూతన సంవత్సర ప్రారంభం మాత్రమే కాదు, జీవితాన్ని కొత్త కోణంలో చూడటానికి ఒక అవకాశం. 🌼 వసంత ఋతువు – ప్రకృతి ఉత్సవం  వసంత ఋతువు ఉగాదితో ప్రారంభమౌతుంది. ప్రకృతి కొత్త జీవితాన్ని అందుకుంటుంది. శరీరానికి, మనసుకు హాయిగా ఉంటుంది. ప్రకృతి సహజంగా జీవ శక్తిని పెంచుతుంది. మామిడి పూలు వేప పువ్వులు పచ్చని చెట్లు ఇది ప్రకృతి మనకు ఇచ్చే ఒక అవకాశం.  ఉపయోగం లేని అలవాట్లు విడిచిపెట్టి జీవితానికి సహకరించే అలవాటులను, అవకాశాలను ఆహ్వానించాలి. 🌸 ఉగాది యొక్క ప్రాముఖ్యత చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సంవత్సర ఆరంభమౌతుందని పంచాంగ శాస్త్రం చెబుతుంది. పురాణాలలో సృష్టి ఆరంభం వసంతంతో మొదలౌతుంది అని చెప్పబడింది. ఆ వసంతం చైత్రమాసం తో మొదలౌతుంది. చైత్రమాసం లో మొదటి రోజునే ‘యుగాది’గా భావించడం సాంప్రదాయంగా ఏర్పడింది.   బ్రహ్మ దేవుడు  ఈ రోజే సృష్టిని ప్రారంభించాడ...

శ్రీరామనవమి శుభాకాంక్షలు

శ్రీరాముడు పురుషోత్తముడు అంటారు కదా. ఎందుకంటారు? ఆయనకు తిరుగులేదు అనా? కానే కాదు.  వాళ్ళ పినతల్లి వల్ల అడవుల పాలు ఐనా ఆమె కొడుకుని రాజుగా చేసినా విధిని మాత్రం వినమ్రత తో పాటించాడు. ఎవ్వరినీ పల్లెత్తు మాట అనలేదు. తండ్రి మాట కోసం సుఖంగా ఉన్న జీవితాన్ని త్యాగం చేసి కష్టాల బాట ఎంచుకున్నాడు. తన కర్తవ్యాన్ని పూర్తి శ్రద్ధతో, శక్తి యుక్తులతో నిర్వర్తించాడు. అందులో మనం తెలుసుకోవాల్సిన నిగూఢ రహస్యం ఏమిటంటే కష్టం లేకుండా జీవించడం గొప్ప విషయం కాదు. కష్టాల్లో ఉన్నా కూడా తన సౌమ్య శీలాన్ని, శక్తి యుక్తులను కోల్పోకుండా ఎలా ఉండాలో రాముడు మనకు చూపించాడు.  ఇది సత్యదూరం గా అనిపిస్తుంది మనకి. కానీ నిజం ఏంటంటే మనం మన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల ఇది సాధ్యం కాదు అని అనుకుంటాం. ఈ రోజుల్లో మన ఇంటినీ సుఖాన్ని వదిలి వెళ్ళమని ఎవరూ చెప్పట్లేదు కదా! జీవితం లో వచ్చే ఒడిదుడుకులు తట్టుకుని నిలబడే నిబ్బరం ఉండాలి అంతే! ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు వాడుకొని వదిలేస్తే అది బాధ. కానీ అలా జరగదు అని అనుకోవడం మన అమాయకత్వం. లోకంలో మనం తప్పు చేసినా భరించేది మన తల్లిదండ్రులే. ఇంకెవ్వరూ కనీసం మన కోసం మన కంటే ఎక్కువ ఆలోచించరు. అల...

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

యత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమంతి దేవతాః | యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలాః క్రియాః॥ - మను స్మృతి అధ్యాయం 3, శ్లోకం 56 మెదటి చరణం అందరికీ తెలిసిందే. ఆడవారు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని అర్థం. కానీ రెండో చరణం అర్థం మనుస్మృతి లో స్త్రీ కి ఉన్న గౌరవం, ప్రాముఖ్యత ఉటంకిస్తూ ఉంది. యత్రైతాస్తు న పూజ్యంతే = యత్ర + ఇతి + న + అస్తు + పూజ్యంతే = ఎక్కడ ఆమె పూజించబడదో సర్వాస్తత్రాఫలాః క్రియాః = సర్వః + తత్ర + అఫలాః + క్రియాః = అక్కడ ఏ పనీ ఫలించనట్టే. అంటే ఎక్కడ స్త్రీ గౌరవించబడదో అక్కడ ఏమున్నా, ఎంతున్నా నిష్ప్రయోజనం అని. స్త్రీ కి గౌరవం ఇవ్వండి అని చెప్పి ఊరుకోలేదు. ఆమెకు గౌరవం ఇవ్వని చోట ఇంకేమీ విలువైనది కాదు అని తర్కపూర్ణంగా ఉటంకిస్తూ చెప్పారు.  ఇది మన సంస్కృతిలో స్త్రీ యొక్క స్థానం. ముష్కర మూకలు మన మీద దాడి చెయ్యక ముందు కాలంలో స్త్రీకి అన్ని వ్యవహారాలలో అవకాశం, గౌరవం ఉండేది. స్త్రీ తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవటానికి నిర్ణయించుకున్నా, విద్య నుంచి యుద్ధం వరకు ఏ అంశంలో ఉండాలని నిర్ణయం తీసుకున్నా సమానమైన గౌరవం ఉండేది. వేదాలు వ్రాసిన వారిలో లోపముద్ర వంటి స్త్రీ మూర్త...