Skip to main content

ఆడపిల్ల అంటే అంగడి సరుకు కాదు

 ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ చూసాను. అది నాకు చాలా బాధ కలిగించింది. ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకునే ముందు తన తల్లిదండ్రులకి ఒక లెటర్ వ్రాసింది. ఆ లెటర్ సారాంశం ఇలా వుంది.

 

అమ్మా, నాన్నా,

నేను ఒక అబ్బాయి ప్రేమలో మోసపోయాను. వాడు నన్ను అనుభవిస్తూ నాకు తెలియకుండా వీడియో తీసి నన్ను బెదిరించి వాడి స్నేహితులందరితో నన్ను అనుభవింపజేసి నన్ను మానసికంగా శారీరకంగా చిత్రవధ చేసాడు. నా ఒళ్ళంతా నొప్పిగా ఉంది. నా మనసు అవమానంతో కుంగిపొయింది. భరించ లేక చనిపొతున్నా. నన్ను క్షమించండి. మళ్ళీ జన్మ అంటూ ఉంటే మీ బిడ్డ గానే పుట్టి మిమ్మల్ని బాగా చూసుకుంటాను.

 

ఇది చదివినప్పుడు మొట్టమొదట చాలా బాధ కలిగింది. వాడసలు మనిషేనా అనిపించింది. నమ్మిన ఆడపిల్లని గుండెల్లో దాచుకోవాల్సింది ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడా? వాడే నా చేతికి దొరికితే వాడిని ముక్కలు కొట్టి కుక్కలకి వెయ్యాలనిపించింది. ఇలాంటి పనులు ఎలా చేస్తారు అని ఆలోచించాను. చెడు సావాసం వల్ల కావచ్చు, తల్లిదండ్రుల పెంపకం బాగాలేక కావచ్చు, ఇంకేదైన ఇతర కారణం కావచ్చు అనిపించింది.

కానీ ఎవరో చేసిన తప్పుకి ఒక ఆడ పిల్ల బలి కావాల్సిందేనా అనిపించింది. ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికీ రాకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి అని నా ఆలోచనలు సాగాయి. ఆడపిల్ల అంగడి సరుకు కాదు. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. వాళ్ళను ఒక వస్తువు లాగా చూడటం సరైన పని కాదు. కేవలం శృంగార వస్తువుగా చూడటం నేరమే కాదు, పాపం కూడా. మన ఇళ్ళల్లో మనకు ఇదే చెప్పి పెంచుతారు. కానీ మన లో పశుప్రవృత్తి ప్రబలటానికి, అది బరితెగించి ఆడపిల్లలను బలితీసుకోవటానికి మనం చూస్తున్నవి, మన సావాసాలు, మన మానసిక బలహీనతలు చాలా బలమైన కారణాలు. 

 

పరిష్కారం కోసం రెండు ముఖ్యమైన మార్గాలు నాకు తోస్తున్నాయి.

ఒకటి, శ్రుంగార రసాన్ని వీధుల్లో ప్రదర్శించటం ఆపాలి. 

వీధి లో నడిచే ప్రతి వాడు విచక్షణ కలిగి ఉండడు. వ్యాపార ప్రకటనల్లో ఆడ పిల్లల్ని సభ్యంగా చిత్రించాలి. సినిమాల్లో కధానాయికల పాత్రలని హుందాగా చూపించాలి. టివి లో కార్యక్రమాలు సభ్యమైన సంస్కృతిని చూపించాలి. రియాలిటీ పేరుతో స్త్రీని శ్రుంగార వస్తువుగా చిత్రించటం మానాలి.

అశ్లీలమైన సినిమాలు చూడటం ద్వారా గానీ, అలాంటి పుస్తకాలు చదవటం వల్ల గానీ, అలాంటి పనులు చేసే వాళ్ళ సావాసం లో ఉండటం వల్ల గానీ ఇలాంటి భావాలు పెంచుకుంటారు. ఈ భావాలు నెమరువేసుకునేకొద్దీ అలా చెయ్యాలనే కోరిక బలంగా మారి అటువంటి పనులు చేస్తారేమో అనిపిస్తుంది.

తల్లిదండ్రులు పిల్లలకి రెగ్యులర్ గా కొంత టైం కేటాయించి వాళ్ళతో సరదాగా గడపాలి. అలా చేస్తే చాలా వరకూ సమస్యని కట్టడి చెయ్యవచ్చు అనిపిస్తుంది.

 


రెండు, ఆడ పిల్లలు కొన్ని విషయాలు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

1. మనిషిగా పుట్టిన తరువాత, యుక్త వయసు వచ్చినప్పుడు అందరికీ శారీరక వాంఛలు ఉంటాయి. ప్రేమ శరీరాన్ని అడగదు. అది మనసుకు సంబంధించిన విషయం. వివాహం కంటే ముందు శారీరక సంబంధం విపరీతాలకి దారి తీస్తుంది. ఎప్పుడు మనం శారీరక వాంఛని గెలవనిస్తామో అదే క్షణం మన భవిష్యత్తుని మనమే నాశనం చేసుకుంటాం. ఇది ప్రతి వ్యక్తి జీవితంలో జరగకపోవచ్చు. అలా అని సమస్య తీవ్రతని తక్కువగా చూడకు.

 

2. మీ తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపండి. వాళ్ళది నిజమైన ప్రేమ అని ఎవరూ మీకు చెప్పే పని లేదు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దగ్గరకు తీసుకుంటారు. దయచేసి మీ తల్లిదండ్రుల తో మీ సమస్యలు చర్చించండి. ప్రాణం చాలా విలువైనది. వాళ్ళు కోప్పడొచ్చు, చంపెయ్యరు. ఒక వేళ చంపేస్తారే అనుకో. వాళ్ళ చేతిలో చచ్చిపో కావాలంటే. వాళ్ళతో మట్లాడే అవకాశం మాత్రం వదులుకోకు.


వితండ వాదం

చాలా మంది ఆడ పిల్లలు ఈ రోజుల్లో ఫ్యాషన్ పేరు తో అవయవాలు కనపడేలా బట్టలు వేసుకోవటం పరిపాటి. అది మంచా చెడా అని నేను వాదించబోవటం లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఏది మంచో ఏది కాదో నిర్ణయించి చెప్పే అధికారం నాకు లేదు. కానీ నా ఆలోచన మీ అవగాహనకు సహకరించవచ్చు. మీకు వేరేలా అనిపిస్తే దయచేసి మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచగలరు. 


చిన్న కధతో నా ఆలోచన మీ ముందు పెడదామనుకుంటున్నాను.


అనగనగా ఒక అడవి. ఆ అడవి చాలా అందమైన జీవరాశులకు కేరాఫ్ అడ్రస్. అందులో ఒక జింకల సమూహం చూడ చాలా చక్కగా ఉండేది. పారే శెలయేరు, దానికి ఆనుకుని ఏపుగా పెరిగిన గడ్డి జాతులు, పుష్ప జాతులు ఎన్నో మొక్కలు. చూడ చక్కని దృశ్యం. అలాంటి చక్కని ప్రదేశంలో ఆ జింకల సమూహం హాయిగా ఆనందం గా జీవిస్తూ ఉండేది.


ఆ అడవికి ఒక రోజు ఒక వేటగాడు వచ్చాడు. ఆ జింకలను చూడగానే వాడికి వేటాడాలనిపించింది. ఒక జింకను వేటాడి దాన్ని వండుకుని తిన్నాడు. వాడి దృష్టిలో వాడు చేసినది తప్పు కానే కాదు. ఎందుకంటే వాడు వేటగాడు.


ఈ పరిస్థితిని చూసి ఆ గుంపు లోని దీర్ఘనయన అనే జింక తన గుంపు లో అందరి తో ఇలా చెప్పింది. "ఈ వేటగాడు మన అందరినీ చంపుకుని తినేస్తాడు. ఇక్కడ ఉండటం మంచిది కాదు. మనం వీడికి దూరంగా ఇంకొక ప్రాంతానికి పోయి బ్రతుకుదాము. పరిస్తితులకు అనుగుణంగా మనం మారుతుండాలి."


గుంపు లోని చాలా జింకలు ఆ ఆలోచన సరైనదే అని సమర్ధించాయి. కానీ హ్రస్వకీర్తి ఆలోచన వేరే లా ఉంది. "మనం ఇక్కడే పుట్టాం. ఇక్కడే పెరిగాము. కష్టం వచ్చింది అని మారుతూ పోతే ఇక మన గుర్తింపు ఏముంటుంది? మనం ఇక్కడే ఉందాం. వాడి కంటపడకుండా ఉందాం. మారుదాం, కానీ మనలా ఉందాం."


గుంపులోని జింకలన్నీ రెండు గుంపులు గా విడిపోయాయి. దీర్ఘనయన గుంపు వేరే చోటికి వలస వెళ్ళాయి. హ్రస్వకీర్తి గుంపు అక్కడే ఉంటూ వేటగాడికి కనబడకుండా తిరుగుతూ బ్రతుకుతున్నాయి. వేటగాడు జింకలకోసం కొద్దిరోజులు వెతికాడు కానీ కనబడలేదు. వాడు బాగా ఆలోచించి జింకలు తినే గడ్డి పైన మత్తు మందు చల్లి కాస్త దూరం జరిగి వెళ్ళాడు. 


జింకలు వేటగాడి ఆనవాలు కనబడకపోవటంతో నెమ్మదిగా వచ్చి గడ్డి తినటం మొదలుపెట్టాయి. గడ్డి పైన వేటగాడు వేసిన మత్తుమందు వల్ల గడ్డి తిన్న కొంచెం సమయానికి స్పృహ కోల్పోయి పడిపోయాయి. అందులో ఒక జింకని ఎంచుకుని వేటగాడు వెళ్ళాడు. జింకలకు స్పృహ వచ్చేసరికి ఒక జింక లేదు. ఎటో వెళ్ళే ఉంటుంది. వేటగాడికి కనబడకుండా తిరగటం మనకు తెలుసు కదా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళాయి. కొద్ది రోజులకు అవి తప్పిపోయిన జింక గురించి మర్చిపోయాయి.


వేటగాడు తన పాచిక పారింది కాబట్టి మళ్ళా అదే కిటుకు వాడి వేటాడటం మొదలు పెట్టాడు. గుంపులోని జింకలు తగ్గటం మొదలైంది. జింకలకు నెమ్మది గా తెలుస్తోంది. కానీ వేటగాడు అలవాటు చేసిన మత్తుమందు వాటి ఆలోచనా శక్తిని మొద్దుబారేలా చేసింది. మన బ్రతుకులు ఇంతే అనుకుంటూ బ్రతుకులు ఈడ్చుకుంటూ ఉన్నాయి.


ఇంతలో ఒక రోజు దీర్ఘనయన గుంపు లోని కొన్ని జింకలు అటుగా వచ్చి పరిస్థితి తెలుసుకుని ఆ గుంపుని వాటితో వెంటబెట్టుకుని కొత్త చోటికి తీసుకుని పోయాయి. అప్పుడు దీర్ఘనయన ఇలా అంది. "మీరంతా ఇప్పటికయినా ఇక్కడికి చేరటం నాకు చాలా ఆనందం గా ఉంది. పరిస్థితులు మారినప్పుడు మనం మారాలి. మనం ఎంచుకునే నిర్ణయం మన బలాలు, బలహీనతలు తెలుసుకుని తీసుకోవాలి. మన చోటు అని మన బలహీనతని మరిచిపోతే కష్టాలు మనమే కొని తెచ్చుకుంటాము. ఏదేమైనా, మీరు ఇక్కడకి రావటం చాలా సంతోషం. మీరు కూడా మా తో పాటు ఇక్కడ హాయి గా ఉండవచ్చు."


ఆ హ్రస్వకీర్తి గుంపు లోని జింకలు బుద్ధి తెచ్చుకుని ఆ పాత గుంపుతో హాయిగా జీవించటం మొదలు పెట్టాయి. వాటి జీవిత పాఠాలను అందరితో పంచుకుని సహకరించాయి.


ఈ కధ లో నీతి ఏమిటంటే - మన చుట్టూ పరిస్థితులు ఎప్పుడూ ఒకే లాగా ఉండవు. అవి మారుతున్నప్పుడు మనం మారాలి. కానీ ఆ మార్పు ఎలాంటిది అయి ఉండాలి అంటే మనకు దీర్ఘకాలం ఉపయోగ పడాలి. మన శక్తికి, బలహీనతలకి సరిపడేలా ఉండాలి.


సమాజం అంటే అందులో అన్ని రకాల మనుషులు ఉంటారు కదా. కొందరు దీర్ఘనయన లా దూరం ఆలోచిస్తారు. వాళ్ళను మనం అనుసరించటం మేలు. హ్రస్వకీర్తి లా ఆలోచించే వాళ్ళకు కాస్త దూరం ఉండాలి. అది మనకు మంచిది. వేటగాడి లాంటి వాళ్ళకు మనం ఆమడ దూరం లో ఉండాలి. 


మన సంరక్షణ మన బాధ్యత. ప్రభుత్వాలు, పోలీసులు జరిగిన నేరానికి శిక్షలు వెయ్యగలరు గానీ ప్రమాదాలని ఆపలేరు. వాళ్ళ పాత్ర అంతే. నేను నా ఇష్టమొచ్చినట్టు నేనుంటాను. అందరూ నాకు సంరక్షణ ఇవ్వాలి అనుకుంటే అది అమాయకత్వమో, మూర్ఖత్వమో అవుతుంది తప్ప వివేకం అనిపించుకోదు. చేతులు కాలాక ఆకులు పట్టుకొనే పద్ధతి మనకు మంచి చెయ్యదు కదా.


మన చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మనం ఉండటం అవసరం. అది మంచి అయితే లేదా అవసరం అయితే తప్పకుండా మారుదాం. నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, సమాజం నన్ను నా ఇష్టం వచ్చినట్టు ఉండనివ్వటం లేదు, నాకు స్వేచ్చ లేదు అని ఆలోచించటం మంచి చెయ్యదు. మన గురించి మనకు లేని బాధ్యత ఇంకెవరికో ఉండాలని ఆశించటం మూర్ఖత్వం.


ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయం వేరైనా దాన్ని గౌరవిస్తాను. కానీ ఎప్పుడూ మీ మేలును కాంక్షిస్తాను. మీ అభిప్రాయాలను పంచుకోండి. 

Comments

Popular posts from this blog

గుండె సవ్వడి

గుండె సవ్వడి!  ఇది తెలుగు వారి గుండె సవ్వడి!  మన తెలుగు వారి మనసుల్లో ఆలోచనలు కూడా తెలుగులోనే ఉంటాయి కదండీ! అందుకే మనందరి మనసులకు అద్దం పట్టేలా ఈ తెలుగు బ్లాగ్ మొదలుపెట్టాను.  నా పేరు కుంచాల. వంశీ కృష్ణ. వృత్తిపరంగా నేనొక సాఫ్ట్వేర్ ఇంజినీర్. ప్రవృత్తిపరంగా నేనొక తెలుగు వాడిని. సంస్కృతి, సాంకేతికతల మేలి కలయిక మన సంస్కృతి విలువను మరింత పెంచుతుందని నా నమ్మకం. తెలుగును జగద్విఖ్యాతం చెయ్యటంలో సాంకేతికత సముచిత పాత్ర పోషించిందనటం నిర్వివాదం. హైటెక్ సిటీ నుండి ప్రపంచ కోణ కోణాలకు తెలుగు విస్తరించి ఉందంటే అతిశయోక్తి కాదేమో! నాకు మన తెలుగు భాష అన్నా, మన సంస్కృతి అన్నా ఎనలేని మక్కువ. తెలుగు లో మాట్లాడే ప్రతి పదం మనసుకు ఇంపుగా ఉంటుంది నాకు. ఇది చదువుతున్నారు అంటే మీకు కూడా అలాగే ఉంటుంది అని భావిస్తున్నాను. తెలుగదేలయన్న తెలుగొకండ అన్నారు శ్రీ కృష్ణ దేవరాయలు. మన  తెలుగు చరిత్ర పైన,  తెలుగు ఆచార వ్యవహారాల పైన,  సనాతన సంస్కృతి పైన: తర్కబద్ధమైన, సకారాత్మకమైన, ఉత్తేజభరితమైన, ఉల్లాసభరితమైన వివరాలు సేకరించి పొందుపరచటం ఈ బ్లాగ్ లక్ష్యాలలో ఒకటి. మన ముందు తరాల వారికి ఇది ఒక వారసత...

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

యత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమంతి దేవతాః | యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలాః క్రియాః॥ - మను స్మృతి అధ్యాయం 3, శ్లోకం 56 మెదటి చరణం అందరికీ తెలిసిందే. ఆడవారు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని అర్థం. కానీ రెండో చరణం అర్థం మనుస్మృతి లో స్త్రీ కి ఉన్న గౌరవం, ప్రాముఖ్యత ఉటంకిస్తూ ఉంది. యత్రైతాస్తు న పూజ్యంతే = యత్ర + ఇతి + న + అస్తు + పూజ్యంతే = ఎక్కడ ఆమె పూజించబడదో సర్వాస్తత్రాఫలాః క్రియాః = సర్వః + తత్ర + అఫలాః + క్రియాః = అక్కడ ఏ పనీ ఫలించనట్టే. అంటే ఎక్కడ స్త్రీ గౌరవించబడదో అక్కడ ఏమున్నా, ఎంతున్నా నిష్ప్రయోజనం అని. స్త్రీ కి గౌరవం ఇవ్వండి అని చెప్పి ఊరుకోలేదు. ఆమెకు గౌరవం ఇవ్వని చోట ఇంకేమీ విలువైనది కాదు అని తర్కపూర్ణంగా ఉటంకిస్తూ చెప్పారు.  ఇది మన సంస్కృతిలో స్త్రీ యొక్క స్థానం. ముష్కర మూకలు మన మీద దాడి చెయ్యక ముందు కాలంలో స్త్రీకి అన్ని వ్యవహారాలలో అవకాశం, గౌరవం ఉండేది. స్త్రీ తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవటానికి నిర్ణయించుకున్నా, విద్య నుంచి యుద్ధం వరకు ఏ అంశంలో ఉండాలని నిర్ణయం తీసుకున్నా సమానమైన గౌరవం ఉండేది. వేదాలు వ్రాసిన వారిలో లోపముద్ర వంటి స్త్రీ మూర్త...

🌿 ఉగాది పండగ - ఎందుకు, ఏమిటి, ఎలా?

  ఉగాది అంటే కేవలం ఒక పండుగ కాదు… ఇది కొత్త ఆలోచనలకు, కొత్త ఆశలకు, కొత్త జీవనానికి ప్రారంభం. ఉగాది  - యుగాది అనే పదం నుండి వచ్చింది. “యుగాది” అంటే  “యుగం + ఆది” — అంటే కాలానికి ఆరంభం అని అర్ధం . తెలుగు ప్రజలకు ఇది నూతన సంవత్సర ప్రారంభం మాత్రమే కాదు, జీవితాన్ని కొత్త కోణంలో చూడటానికి ఒక అవకాశం. 🌼 వసంత ఋతువు – ప్రకృతి ఉత్సవం  వసంత ఋతువు ఉగాదితో ప్రారంభమౌతుంది. ప్రకృతి కొత్త జీవితాన్ని అందుకుంటుంది. శరీరానికి, మనసుకు హాయిగా ఉంటుంది. ప్రకృతి సహజంగా జీవ శక్తిని పెంచుతుంది. మామిడి పూలు వేప పువ్వులు పచ్చని చెట్లు ఇది ప్రకృతి మనకు ఇచ్చే ఒక అవకాశం.  ఉపయోగం లేని అలవాట్లు విడిచిపెట్టి జీవితానికి సహకరించే అలవాటులను, అవకాశాలను ఆహ్వానించాలి. 🌸 ఉగాది యొక్క ప్రాముఖ్యత చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సంవత్సర ఆరంభమౌతుందని పంచాంగ శాస్త్రం చెబుతుంది. పురాణాలలో సృష్టి ఆరంభం వసంతంతో మొదలౌతుంది అని చెప్పబడింది. ఆ వసంతం చైత్రమాసం తో మొదలౌతుంది. చైత్రమాసం లో మొదటి రోజునే ‘యుగాది’గా భావించడం సాంప్రదాయంగా ఏర్పడింది.   బ్రహ్మ దేవుడు  ఈ రోజే సృష్టిని ప్రారంభించాడ...