తెలుగు భాషాభిమానులకు తెలుగు పండుగలు ప్రత్యేకమైన ప్రాధాన్యం కలిగినవి. ఇవి కేవలం ఉత్సవాలుగానే కాక, తెలుగు ప్రజల జీవనశైలిలోని ఆనందాన్ని, అనుబంధాలను, జీవితం పట్ల సానుకూల మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తాయి. తెలుగు పండుగలు ప్రకృతిని, కుటుంబ బంధాలను, ఆధ్యాత్మిక ప్రగతిని గౌరవించడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తాయి.
1. సంక్రాంతి
ఈ పండగని మకర సంక్రాంతి అని కూడా అంటారు. సంక్రాంతి తెలుగు ప్రజల ముఖ్యమైన పండుగ. ఇది రైతులకు పంట చేతికి వచ్చే సమయం. ప్రకృతిని, రైతులను గౌరవించడానికై జరుపుకునే పండుగ. పూర్వీకులను గుర్తు చేసుకుని వారికి కృతజ్ణతలు తెలుపుకునే సాంప్రదాయం కూడా ఉంది.
సంక్రాంతి సమయానికి రైతులు పంటను ఇంటికి చేర్చి కూలీలకు వారి కష్టానికి ప్రతిఫలం ఇస్తారు. దాదాపు నాలుగు నెలల శ్రమకు ఫలితం దక్కుతుంది. సమాజంలో అన్ని వర్గాల వారికి వ్యవసాయంతో ఏదో ఒక రకమైన సంబంధం ఉంటుంది. కూటికోసం కోటి విద్యలు అనే సామెతను వినే ఉంటారు. ఆ కూడు ఇంటికి చేరే సమయం ఈ మకర సంక్రాంతి. అందరి ఇళ్లల్లో సంక్రాంతి సంతోషాలు నింపుతుంది కనుక దీన్ని పెద్ద పండుగ అంటారు.
ఈ పండగ ముందు, వెనుక కూడా కొన్ని పండగలు వరుసగా ఉన్నాయి.
- భోగి పండుగ: సంక్రాంతికి ముందు రోజు వచ్చే ఈ పండగకు ఇళ్లను శుభ్రపరచి, పాత వస్తువులను తగలబెట్టి నూతన జీవనానికి ఆహ్వానం పలుకుతారు. ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి చేదు తాగి (ట్రెడిషనల్ డీటాక్స్ అన్నమాట), కాలకృత్యాలు తీర్చుకుని భోగిమంటల్లో ఆవు పేడతో చేసిన పిడకలు వేసి మంట చుట్టూ చేరి స్నేహితులు అందరూ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా మొదలు పెడతారు. తరువాత స్నానం చేసి పిండి వంటలు చేసుకుని తింటారు. సాంప్రదాయముగా ఈ పండుగ సమయంలో పిల్లల ముంగురులు తొలగించి, చిన్నారులపై ఆశీర్వాదాలు కురిపిస్తారు. భోగి పళ్ళు (రేగు పండ్లు) చిన్న పిల్లల తలపై నుంచి పోసి మురిసిపోతూ ఉంటారు తల్లిదండ్రులు.
- కనుమ పండుగ: గోవులను పూజించి, పశువుల పట్ల కృతజ్ఞత వ్యక్తం చేస్తారు.
- ముక్కనుమ పండుగ: ఇది నాకు తెలిసినంతవరకు, కేవలం తిండి కోసమే అన్నట్టు ఉంటుంది. బంధువులు అందరూ కలిసి ఆనందంగా గడుపుతారు. కలిసి వంటలు చేసుకుని ఆనందంగా తింటారు. ఐనవాళ్ళతో కలిసి ఆనందం పంచుకోవటం కంటే గొప్ప అనుభవం, అనుభూతి ఏముంటుంది చెప్పండి?
2. ఉగాది
ఉగాది తెలుగు నూతన సంవత్సర వేడుక. చంద్రమాన (లూనీసోలీర్) క్యాలెండర్ ప్రకారం ఈ పండుగ జరుపుకుంటారు. ఉగాది తో వసంతం మొదలవుతుంది. ఉల్లాసవంతమైన వాతావరణం జీవరాశులన్నింటిలో ఉత్తేజం, ఉత్సాహం కలిగిస్తుంది. మొక్కలు చిగురిస్తాయి, పువ్వులు పూస్తాయి. చలి పూర్తిగా తగ్గుతుంది. ప్రాణం చాలా హాయిగా ఉంటుంది.
- ఉగాది పచ్చడి ప్రత్యేకత: బెల్లం తీపి, వేప చేదు, చింతపండు పులుపు, ఉప్పు, మిరపకాయ/ మిరియాల కారం, మామిడి కాయ వగరు. వీటిని కలిపి చేసే పచ్చడి ఉగాది పచ్చడి. ఈ ఆరు రుచులతో కూడిన ఉగాది పచ్చడిని స్వీకరించి, జీవితంలోని
తీపి, చేదులను, కష్ట సుఖాలను
స్వాగతించడాన్ని సూచిస్తారు. ఈ సాంప్రదాయం జీవితం పట్ల ఒక తర్కబద్ధమైన అవగాహనను సూచిస్తుంది. కష్టాలకు కుంగిపోకు, సుఖాన్ని చూసి విర్రవీగకు. అన్నీ జీవితంలో భాగం కావాలి అని ఎమోషనల్ బ్యాలెన్స్ నేర్పేది ఈ పండగ.
- ఈ రోజున పంచాంగ శ్రవణం చేయడం ఒక సంప్రదాయం. పంచాంగం అంటే ఐదు అంగాలతో కూడిన వివరాలు. రాశుల వారీగా, నక్షత్రాల ఆధారంగా ఎవరి జాతకంలో ఎటువంటి అవకాశాలు, ఒడిదుడుకులు ఉంటాయి అనేది అంచనా వేసి చెప్పే సంస్కృతి ఇది. ప్రతి వారికీ ఎంతో కొంత మంచి, ఎంతో కొంత చెడు ఉంటుంది. జాతకాలను నేను అంతగా నమ్మను, కానీ సవ్యంగా లెక్క కట్టగల శాస్త్రం ఒకటి ఉంది. మన మానసిక సంతులనం బాగుంటే ఎలాంటి పరిస్థితులు ఐనా ఎదుర్కొని ముందుకు వెళ్తాము. ఆ సంతులనం సాధించడానికి ఈ పంచాంగం ఒక సాధనం అని పెద్దలు చెబుతారు.
3. శ్రీ రామ నవమి
శ్రీ రాముడి జన్మదినంగా ఈ పండుగ జరుపుకుంటారు. ప్రత్యేకంగా
భద్రాచలంలో ఈ పండుగకు గొప్ప స్థానం ఉంది.
- కళ్యాణం: రాముడికి,
సీతాదేవికి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు.
- శ్రీమద్రామాయణ పఠనం, భజనలు ఈ
పండుగ ప్రత్యేకతలు.
- ఇంచుమించు ప్రతి ఊరిలోనూ రామాలయం ఉంటుంది. అక్కడ అంతా చేరి పూజలు చేసి, వడపప్పు, పానకం ప్రసాదం గా తీసుకుని హరికథా కాలక్షేపం, పురాణ పఠనం చేస్తారు.
4. వినాయక చవితి
వినాయకుడు అంటే తెలుగువారికి అందరికీ ప్రత్యేకమైన దేవుడు. విఘ్నాలను తొలగించే దేవుడిగా గణపతిని పూజిస్తారు. తొమ్మిది రోజుల పాటు వినాయకుడిని పూజించి తరువాత నిమజ్జనం చేస్తారు. వీటిని వినాయక నవరాత్రులని అంటారు. వర్ష ఋతువులో వస్తుంది ఈ పండగ. 21 రకాల పత్రాలతో వినాయకుడిని పూజిస్తారు. వీటిలో చాలా ఔషద గుణాలు ఉన్న మొక్కలు ఉంటాయి. వాటిని ఈ పూజలో ఉపయోగించే సాంప్రదాయం వల్ల ఆ మొక్కలను గుర్తించే జ్ఞానం కలిగి ఉంటారు. ఆ మొక్కలను రక్షించుకునే అవసరం, అక్కర ఉంటుంది. ఇంకో శీర్షిక లో గణపతి పూజ, శాస్త్రీయ అనుసంధానం పైన చర్చిస్తాను.
- పాటలు, నృత్యాలు: గణపతి విగ్రహాలను నెలకొల్పి, పూజలు చేస్తారు, వివిధ కళా
ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ మధ్య కాలంలో లో సినిమా పాటలు, అర్థం పర్ధం లేని నృత్యాలు కూడా చేస్తున్నారు కానీ, ఒకప్పుడు చాలా భక్తి శ్రద్ధలతో పూజలు చేసేవారు, సాంప్రదాయక కళాప్రదర్శనలు చేసేవారు. వాటిలో భజన పాటలు, నృత్యాలు కూడా ఉండేవి. ఒక విధమైన ప్రశాంత వాతావరణం ఉండేది. చాలా ఉత్సాహంగా పిల్లలు, పెద్దలు పాల్గొనేవారు.
- నిమజ్జనం: పూజలు ముగిశాక, గణపతిని నీటిలో నిమజ్జనం చేస్తారు. గణపతిని వాళ్ళ ఇంటికి సాగనంపుతారు అనుకోండి. ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఉంటారు. చుట్టం చూపుగా వస్తారు. అందుకే మళ్లీ రమ్మని ఆప్యాయంగా సాగనంపుతారు.
5. దసరా/విజయదశమి
తెలుగు ప్రజల సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పండుగ. ఇది శక్తి
దేవతలను పూజించడమే కాక, న్యాయం, ధర్మం యొక్క విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు.
- అలంకరణ: దుర్గామాత
ఆలయాలను ప్రత్యేకంగా అలంకరిస్తారు. అమ్మవారు
పది అవతారాలలో పది రోజులు దర్శనమిస్తారు. స్త్రీ శక్తిని, ఆమె జీవితంలోని ముఖ్య ఘట్టాలనీ ప్రతిబింబించే ఈ
నవరాత్రి ఉత్సవాలు తెలుగు వారికి అమ్మ పట్ల, ఆడవారి
పట్ల ఉన్న గౌరవానికి ఉదాహరణలు గా నిలుస్తాయి.
- నవరాత్రులు: అమ్మ వారిని వివిధ రూపాలలో తొమ్మిది రాత్రులు పూజించి పదవ రోజున విజయదశమి జరుపుకుంటారు.
6. దీపావళి
తెలుగు వారి జీవితాలలో దీపావళి వెలుగుల పండుగగా
నిలుస్తుంది. నరకాసుర వధను గుర్తుచేసుకుంటూ ఈ పండుగ జరుపుకుంటారు.
- దీపాల అలంకరణ: ఇళ్లను
దీపాలతో అలంకరిస్తారు.
- పటాకుల ఉత్సవం: పిల్లలు పటాకులు పేల్చుతూ ఆనందాన్ని పంచుకుంటారు.
7. కార్తీక మాసం పండగలు
కార్తీక మాసం తెలుగు ప్రజలకు పవిత్రమైనది. ఈ కాలంలో శివ కేశవులకు పూజలు నిర్వహిస్తారు. శైవ సాంప్రదాయం ప్రకారం శివునికి, వైష్ణవ సంప్రదాయంలో విష్ణుమూర్తికి పూజలు చేస్తారు. ఈ మాసంలో రోజూ ఒక పర్వదినమే.
- దీపారాధన: కార్తీక
దీపం ప్రత్యేక పూజ. ప్రతి రోజూ ఉదయం సూర్యోదయానికి ముందే లేచి చన్నీటి స్నానం చేసి దీపం వెలిగించి పూజలు చేయడం సాంప్రదాయం. ఈ సాంప్రదాయం వెనుక ఉన్న కారణాల్లో ఒకటి - చలికాలంలో బద్ధకం అనేది దరిదాపుల్లో కూడా రాకుండా పొద్దు పొడవక ముందే లేచి స్నానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు. ఆరోగ్యం, ఆధ్యాత్మిక ప్రగతి, సమయపాలన.
8. బతుకమ్మ పండుగ
తెలంగాణ ప్రాంతంలో ఇది మహిళలకు ప్రత్యేకమైన పండుగ.
- పూల వంట: వివిధ
రకాల పూలతో బతుకమ్మను నిర్మించి, ఆడపడుచులు నృత్యాలు
చేస్తారు.
- ప్రకృతికి గౌరవం చాటే పండుగగా ఇది గుర్తింపు పొందింది.
పండుగల ప్రాధాన్యం
జీవితమంతా
ఆనందంగా సాగిపోవటానికి ఒక క్రమబద్ధమైన సమయాల్లో ఈ పండగలు ప్రకృతి తో మమేకమౌతూ జీవన
గమనాన్ని సాగించే చక్కని అమరిక మన పండగలు. తెలుగు పండుగలు జీవనంలోని ప్రతి సందర్భాన్ని
గుర్తుచేస్తాయి. ప్రకృతిని, కుటుంబ బంధాలను గౌరవించడంలో, ఆనందాన్ని
పంచుకోవడంలో ఈ పండుగలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇవి మన సంస్కృతికి వన్నె తెచ్చే
కాంతులు.
తెలుగు పండుగలు మన సంప్రదాయానికి ప్రతీక. వీటిని తరతరాలకు
అందించడం మన బాధ్యత.
Comments
Post a Comment