ముందుగా ఒక మాట. ఇది చదువుతున్నారు అంటే పెళ్లి గురించి తెలుసుకునే ఉద్దేశ్యం మీకు ఉంది అని నేను నమ్ముతున్నాను. మీ పెళ్లి నూరేళ్ళ పంట కావాలని నా ఆకాంక్ష. మీకు పెళ్లి గురించి, అది విఫలమయ్యే కారణాల గురించి సూటిగా నిక్కచ్చిగా చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి నా మాటలు సూటిగా ఉంటాయి. ఇది మీకు సమ్మతమయితేనే చదవండి. మీ మనోభావాలకు నేను ఎలాంటి హామీ ఇవ్వబోవటం లేదు. మీరు ఇది చదివినందుకు మీకు పెళ్లి గురించి ఒక చక్కటి అవగాహన ఇవ్వటం నా బాధ్యత గా భావిస్తున్నాను.
మీకు ఏది మంచిదో చెప్పే ఉద్దేశ్యం నాకు లేదు. తల్లిదండ్రులు చెప్పేది వినని జనరేషన్ కి నేను చెప్పేది ఎక్కుతుంది అని నేను అపోహ పడను. అలా అని మీరు చెడ్డవారు అని కూడా నేను అనుకోను. మీ పరిస్థితులు మీవి. మీ ఆశలు మీవి. మీ జీవితం మీ ఇష్టం. మీ మంచి కోరుతున్నాను కాబట్టి మీరు పెళ్ళికి ముందు ఆలోచించుకోవటానికి ఈ బ్లాగ్ ఒక మంచి సాధనం అయితే చాలు అని ఆశిస్తున్నాను. ఇక అసలు విషయానికి వస్తాను.
పెళ్లి అంటే అందరికీ ఎన్నో ఆశలు, ఎన్నెన్నో ఆకాంక్షలు. నా పెళ్ళాం ఇలా ఉండాలి, నా మొగుడు అలా ఉండాలి అని. నూరేళ్ళ పంటకు నాంది పెళ్లి. అలాంటి పెళ్లి పెటాకులు అవ్వటం ఎవరికీ సరదా కాదు కదా! కోర్టుల చుట్టూ తిరగటం ఎవరికి సరదా? సమాజంలో చులకన కావటం ఎవరు కోరుకుంటారు? కానీ అలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అని కాస్త ఆలోచిస్తే ఇలా తోస్తుంది.
పెళ్లి అంటే జీవిత కాలం కమిట్మెంట్. ఎవరి ఆశలు వాళ్లకి ఉంటాయి. ఇది ఏమీ తప్పు కాదు. కానీ అవి అవతలి వాళ్లకి చెప్పాలంటే ఎదో తెలియని ఇబ్బంది. నన్ను స్వార్ధపరుడు / స్వార్ధపరురాలు అనుకుంటారేమో అని భయం. అందరి దృష్టిలో నా మంచితనం తగ్గిపోతుందేమో అని బెరుకు. అన్నీ అందరితో ఎలా పంచుకుంటాం అనే సంశయం. ఇలా ఎన్నెన్నో ఆలోచనలతో అంతర్మధనం. ఏరేంజ్డ్ మ్యారేజ్ లో ఒక రకమైన తంటాలు, ప్రేమ పెళ్ళిలో ఇంకోరకం కష్టాలు.
ఏరేంజ్డ్ మ్యారేజ్ లో కుటుంబ గౌరవం పాడు అవుతుందేమో అని భయం ఉంటుంది. మనం చేసే పనులు చేసినప్పుడు ఈ విషయం గుర్తుకు రాదు. పెళ్లికి ముందు నిజం మాట్లాడటానికి ముందు గుర్తు వస్తుంది. సారీ కాస్త పరుషంగా ఉన్నా ఇదే నిజం. మన కుటుంబ గౌరవం మనం స్నేహితులతో తాగటానికి అడ్డు రానప్పుడు అది పెళ్ళికి ముందు, కాబోయే జీవిత భాగస్వామికి చెప్పటానికి ఎందుకు అడ్డు వస్తుంది? తప్పు అనిపిస్తే చెయ్యకుండా ఉంటే మంచిది కదా! కుటుంబ గౌరవం అంత ముఖ్యం అయినప్పుడు దానికి భంగం కలగకుండా బ్రతకడం అవసరం కదా!
భార్య సాంప్రదాయాలను గౌరవించాలి అనుకునేవాళ్లు ముందు వాళ్ళు సాంప్రదాయాలను గౌరవిస్తున్నారా అని ఆలోచించుకోవాలి. లేకపోతే అదే విషయం అమ్మాయికి నిస్సంకోచంగా చెప్పాలి. భార్య సంపాదించాలి అనుకుంటే అది కూడా చెప్పాలి కదా! కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలి అంటే అది కూడా ముందే చెప్పాలి. డబ్బు గురించి ఆమెతో మాట్లాడితే నేను డబ్బు మనిషిని అనుకుంటుందేమో అనుకుంటారు. మరి పెళ్లి అయ్యాక ఆమె మీకు ఆర్ధికంగా సహాయం చెయ్యాలనే ఆశ కూడా ఉండకూడదు అప్పుడు. ఇది మీకు ఓకేనా? అందరూ ఒకే రకంగా ఆలోచించరు కదా!
ఇక అమ్మాయిల విషయానికి వద్దాం. భర్త నన్ను బాగా చూసుకోవాలి అని అమ్మాయిలు సహజంగా ఆశిస్తారు. వీళ్ళ ఆలోచనలు ఇంకో రకంగా ఉంటాయి. బాగా చూసుకోవాలి అనుకుంటారు. కానీ ఆ బాగా అంటే ఏమిటో పెద్ద అవగాహన ఉండదు. తప్పుగా తీసుకోకండి. ఇలాంటివాళ్ళు నాకు చాలా మంది తెలుసు. భర్త బాగా సంపాదించి నాకు కావాల్సినవి కొని పెట్టాలి అనేది మీ ఆశ అయితే అది మీరు కాబోయే అబ్బాయికి తెలియజేయాలి కదా! నేను సాంప్రదాయాల కంటే ఆధునిక జీవితాన్ని గడపాలి అనుకుంటున్నాను అనుకునే అమ్మాయిలు అది కాబోయేవాడికి చెప్పాలి కదా! నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకోవాలి నన్ను ముద్దు చెయ్యాలి అనుకుంటే అది చెప్పాలి కదా!
నా ఇండిపెండెన్స్ నాకు ఉండాలి అనుకునే అమ్మాయి అది పెళ్లికి ముందు చెప్పాలి కదా! నా కెరీర్ నాకు చాలా ముఖ్యం. వచ్చే వాడు ఆ దిశగా నన్ను ప్రోత్సహించాలి అనుకుంటే అది కూడా చెప్పాలి కదా! వచ్చేవాడు అలా ఆలోచించకపోతే మీ జీవితం మీరే పాడుచేసుకున్నట్టు కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. మీకు నేను చెప్పదలచుకున్న విషయం ఈ ఉదాహారణలతో అర్ధం అవుతుంది అనుకుంటున్నాను.
ఇక ప్రేమ పెళ్లిళ్ల విషయానికి వస్తే, ప్రేమ అంటే ఒక అద్భుతం. అది పొందటానికి ఏదయినా చెయ్యొచ్చు. ఎవ్రితింగ్ ఇజ్ రైట్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు కదా! అవతలి వాళ్ళని ఇంప్రెస్ చెయ్యటానికి మొదట్లో చిన్న చిన్న అబద్ధాలు ఆడుతాం. ఇద్దరి మధ్య ప్రేమ పెరిగే కొద్దీ వాళ్ళని వదులుకోవడం మరణసదృశం అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళ మధ్య అబద్ధాలు కూడా అదే మోతాదులో పెరుగుతాయి. పెళ్లి తరువాత, ముసుగులు తొలగి నిజాలు బయటపడటం మొదలవుతుంది. ఇంత ప్రేమించాను! ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను కదా! నన్ను ఎలా మోసం చెయ్యగలిగావు? ఈ ప్రశ్నతో గొడవ మొదలవుతుంది. నువ్వు అప్పుడు అలా చేసావ్ అంటే నువ్వు ఇప్పుడు ఇలా చేసావ్ అని పాత తప్పులు తవ్వుకుని ఒకరికి ఒకరు నరకం చూపిస్తారు. చివరికి వాళ్ళ ప్రేమ చచ్చిపోయి పెద్ద అగాధం ఏర్పడుతుంది. మోసపోయాను అనే భావన పెరగటంతో శత్రుత్వం పెరుగుతుంది. చివరికి విడిపోయేవరకు వస్తుంది.
ప్రేమించటం తప్పు కాదు. కానీ నిజాయితీ చాలా ముఖ్యం. జీవిత కాలం అబద్ధాలు ఆడుతూ బ్రతకటం ఎంత నరకమో ఎప్పుడైనా ఊహించారా?
నాకు కూడా ప్రేమ అనుభవం ఉంది. కానీ నిజం చెప్పటం వల్ల విడిపోయాము. మేము ఒకరికి ఒకరు సరిపోము అనుకుని విడిపోయాము. అలా అని ఒకరిని ఒకరు ఏమి ద్వేషించుకోము. ఎప్పుడైనా గుర్తు వస్తే ఒక తీపి జ్ఞాపకం. అంతే! ఆమె బాగుండాలి అని నేను కోరుకుంటాను. నేను బాగుండాలి అని తను కోరుకుంటుంది. అవసరమయితే వీలైన సహాయం కూడా చేసుకుంటాము. ఒక మాట సాయం, ఒక మంచి మాట, కష్టంలో ఒక ఓదార్పు. అవసరమయితేనే! లేదంటే ఎవరి జీవితాలు వాళ్ళు సాగిస్తున్నాము.
నిజాయితీ సులభం కాదు కానీ అందులో ఒక శక్తి ఉంటుంది. ఎవరికి ఏమి చెప్పాము అని చూసుకుని మాట్లాడవలసిన అవసరం లేదు. వచ్చే ప్రతి సన్నివేశాన్ని అంచనా వేస్తూ చెప్పిన అబద్ధాలని కవర్ చేసే బాధ లేదు. మనసుకు ఏమి తోస్తే అది నిస్సంశయంగా చెప్పెయ్యొచ్చు. నిజం చెప్పే వాళ్ళ మనసు చాలా తేలికగా ప్రశాంతంగా ఉంటుంది. అంత్య నిష్టూరం కంటే ఆదినిష్టూరం మేలు అని వినే ఉంటారు గా! అది ముమ్మాటికీ నిజమండీ!
జీవిత కాలం అనుబంధం అబద్ధాలతో అద్దాల పేక మేడలా కాదు, నిజం పునాదులతో కట్టుకుంటే అది పొదరిల్లయినా అందంగా, ఆనందంగా ఉంటుంది. జీవితం వెనక్కి తిరిగి చూస్తే మన జీవిత అనుభవం మనకు ఒక సంతృప్తిని ఇస్తుంది. నిజానికి మనిషికి కావాల్సిన ముఖ్యమైన పదార్ధం ప్రేమ. అది ఉంటే ఏది ఉన్నా లేకపోయినా బాగానే ఉంటుంది. అది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా సరే! ఒకరికి ఒకరం ఉన్నాం అనే ధైర్యం, ఒకరికి ఒకరం ఆసరా, రోజూ పడుకునే ముందు ఆ రోజు సంగతులు అన్నీ నెమరువేసుకుంటూ కష్ట సుఖాలు పంచుకుంటూ అలా నావ లా సాగిపోతూ ఉంటే చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు మనస్పర్థలు, గొడవలు సహజం. కానీ నిజం మీద నిలబడిన బంధం ఆ ఎగుడు దిగుడు పరిస్థితులకు తట్టుకుంటుంది. అబద్ధాలా పేకమేడ అలవోకగా కూలిపోతుంది.
ఇక పెద్ద వాళ్ళ వంతు!
పెళ్లి అంటే అట్టహాసంగా చేసుకునే ఒక పెద్ద తంతులా చూడటం మన తెలుగు ఇళ్లల్లో పరిపాటి. కేవలం మనమే అనను కానీ మనం అయితే పెళ్ళికి అనవసరమైనంత ఖర్చు చేస్తాం. ఆ ఖర్చుతో ఒక ఇల్లో పొలమో కొనుక్కోవచ్చు. అది ఆర్ధిక భద్రతకు ఉపయోగపడదా?
నిజాయితీగా ఉంటే పెళ్లిళ్లు కావు అనే భావన మన పెద్ద వాళ్లలో చాలా తరచుగా చూస్తాం. ఎవరూ పూర్తిగా నిజాయితీగా ఉండరు లే అనే ఆలోచన కావచ్చు, మనం నిజాయితీగా ఉన్నా అవతలివాళ్ళు ఉంటారు అనే నమ్మకం లేకపోవటం కావచ్చు. వెయ్యి అబద్ధాలు ఆడి ఐనా ఒక పెళ్లి చెయ్యాలి అని ఒక పాత నానుడి. ఇది నిజంగా మంచి చేస్తుందా? అసలు ఈ ఆలోచన మంచిదేనా?
పెళ్లి చెయ్యటం ఎంతో గొప్ప పనిగా భావిస్తాం. ఇది సమంజసం కావచ్చు. కానీ పెళ్లిళ్లు చెయ్యటానికి అబద్ధాలు చెప్పకూడదండీ. మీరు చెప్పిన అబద్ధాలు వాళ్ళ జీవితాలకు అవరోధం కావు అని మీరు భరోసా ఇవ్వగలరా? అబద్ధాల మీద ఆధారపడి కొత్త జీవితం ప్రారంభించే వారికి అది ఎంత పెద్ద అవరోధంగా మారుతుందో మీరు ఊహించగలరా? ఈ పోటీ ప్రపంచంలో ఎంత శ్రమ ఉందో మీకు తెలుసా? ఆ శ్రమకు మీరు ఆడిన అబద్ధాలు ఇంకెంత ఇబ్బందిని జోడిస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా?
ఒకప్పటిలో కుటుంబం చేసే వృత్తి పని చేసుకుంటూ ఇంటిలో అందరూ ఒక తీరుగా బ్రతికే వారు. ఒక కుటుంబంలో పుట్టిన వాళ్ళు అందరూ ఒకేలా ఉండకపోయినా సుమారు ఒకలా ఆలోచించేవాళ్ళు. కనీసం ఒకరి ఆలోచనలు ఒకరికి అర్ధం అయ్యేవి. వారి సామాజిక, ఆర్ధిక పరిణతి బట్టి వాళ్ళ జీవనం సాగించేవాళ్ళు. మానసికంగా బాగా పరిణతి సాధిస్తే ఇంకొంత మెరుగైన జీవితం పొందేవాళ్ళు. దీనికి భిన్నంగా కొన్ని ఉదాహరణలు లేకపోలేదు. కానీ ఎక్కువమంది వారి జీవితాన్ని మనోనిగ్రహంతో సాగించలేరు. వారి చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రకారం మారుతారు. వాళ్ళ జీవితం సుఖంగా ఉండటం వాళ్లకు ముఖ్యం.
ఇప్పుడు అందరూ ఒకే లాంటి బడిలో చదువుతున్నారు. ఒకే లాంటి సామాజిక పరిస్థితి లో బ్రతుకుతున్నారు. అలా అని అందరూ ఒకేలా ఉంటారు అని అనుకుంటే అంత కంటే అమాయకత్వం ఏమి ఉండదు. అలాగే ఉండాలి అనుకుంటే అంత కన్నా మూర్ఖత్వం కూడా ఇంకొకటి లేదు. వివిధ కుటుంబ నేపధ్యం ఉన్న పిల్లలు స్నేహితులు అవుతారు. అందులో తప్పు ఏముంది అనిపిస్తుంది. కాబట్టి మనం ఆ స్నేహానికి ఆమోదం తెలుపుతాము. కానీ భిన్నమైన కుటుంబ నేపధ్యం ఉన్న పిల్లలు అటువంటి భిన్నమైన మనోభావాలు కలిగి ఉంటారు కదా. స్నేహంలో మన ఆలోచనలు అవతలివాళ్ళపైన, వాళ్ళ ఆలోచనలు మన పైన ప్రభావం చూపిస్తాయి. ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అని నానుడి వినే వుంటారు కదా! ఏది మంచి అని ప్రతి క్షణం అంచనా వేసుకుని ఎవరూ వాళ్ళ జీవితాలని గడపరు. వాళ్ళ పరిణతి బట్టి మంచి చెడుల మధ్య వ్యత్యాసం వేరు వేరు గా ఉంటుంది. స్నేహాల వల్ల మన పరిధులు కూడా మారుతాయి.
కుటుంబ సంప్రదాయాలకు ఒకప్పుడు ఉన్నంత ప్రాధాన్యత ఇప్పుడు లేదు. కుటుంబ వ్యవస్థ యొక్క గౌరవం అవసరం తీరేవరకే. ఆ తరువాత వాళ్ళకు ఎలా వీలుంటే అలా, ఎలా అనువుగా ఉంటే అలా, ఎవరికి ఏమి తోస్తే అది చేస్తున్నారు. తల్లిదండ్రులు చెప్పే మాటలు చెవిన వేసుకోరు. యుక్త వయస్సు వచ్చాక ఇంక సరే సరి. అమ్మానాన్నా చెప్పేది పాత చింతకాయ పచ్చడి. మన సినిమాలు ఇలాగే చూపిస్తాయి. ప్రసార మాధ్యమాలు కూడా ఇదే దిశ గా నడుస్తున్నాయి. జీవితం అంటే రోటీ కపడా మకాన్. ఇది దాటి ఎవ్వరూ జీవితం గురించి ఎవరికీ ఏమి చెప్పటం మానేశారు.
అందరూ సమానం అనే ఒక మానసిక చట్రం మినహా పాఠశాలల్లో గానీ కళాశాలల్లో గానీ మంచి చెడూ వివరించేలా పాఠాలు ఏమి ఉండవు. కుటుంబ విలువల గురించి గానీ, సామాజిక పరిణతి గురించి గానీ, ఆర్ధిక పరిణతి గురించి గానీ, మానసిక పరిణతి గురించి గానీ ఎలాంటి పాఠాలు మనకు నేర్పే పరిస్థితి లేదు. ఈ విషయం తప్పుబట్టను. ఎందుకంటే పాఠశాలలు, కళాశాలలు అందరికీ సర్వసామాన్యంగా ఉండే అవసరాల కోసం నిర్మించబడ్డ వ్యవస్థలు. కుటుంబం లోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఏమీ చెప్పే సామర్ధ్యం వీటికి ఉండదు. ఎందుకంటే ప్రతి కుటుంబం నుండి అధ్యాపకులు ప్రతి పాఠశాల లో, కళాశాలలో ఉండే అవకాశం లేదు కాబట్టి.
ఈ రోజుల్లో ఒక్కో వ్యక్తి తన జీవితాన్ని తన మానసిక పరిణతిని బట్టి, పరిస్థితులని బట్టి, తారసపడిన ప్రభావాలని బట్టి, ఇంకెన్నో క్లిష్టమైన సమీకరణాలని బట్టి కుటుంబ విలువలకు చాలా దూరంగా ఒక కొత్త వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడం జరుగుతుంది. ఒక కుటుంబంలో పుట్టిన ఏ ఇద్దరు వ్యక్తులు ఒకలా ఆలోచిస్తారు అనే భరోసా లేదు. అలాంటి వ్యక్తులకు మీరు కాండక్ట్ సర్టిఫికెట్ ఎలా ఇస్తారు? అది నిజంగా ఎంత నిర్దిష్టంగా ఉంటుంది? ఎంతవరకు ఉపయోగపడుతుంది?
కొంతమంది, పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మాయిని, అబ్బాయిని ఒకదగ్గర కూర్చోబెడితే మాట్లాడుకుంటారు అనుకుంటున్నాం. కానీ వాళ్ళ జీవితం గురించి వాళ్ళు ఏమి తెలుసుకున్నారు? వాళ్ళ జీవితం గురించి నిర్ణయం వాళ్ళు తీసుకోగలరా? వాళ్లకు ఆ పరిణతి ఉందా? ఈ విషయాలు మనం అంతగా ఆలోచించము. పెద్దవాళ్ళు అయ్యారు కదా, వాళ్లకు తెలీదా అంటాము. చాలా మందికి వాళ్లకు ఏమి కావాలో తెలీదు. వాళ్లకు ఇది తెలియటానికి జీవితం అంటే వాళ్లకు ఏమి నేర్పించారు చెప్పండి?
వివాహం అనేది ఒకరి కోసం ఒకరు జీవితకాలం కష్ట సుఖాలలో కలిసుంటాం ఒకరికి ఒకరు ఆసరాగా నిలుస్తాం అని చేసుకునే ప్రమాణం. అసలు ప్రమాణానికే విలువ లేని ఈ రోజుల్లో ఆ అర్ధం తెలియని ప్రమాణం విలువ ఎందరికి తెలుస్తుంది? ఎందరు దాన్ని నిలబెట్టుకుంటారు? అలా అని పెళ్లి చేసుకోకుండా బ్రతికే పరిణతి ఉందా అంటే అదీ లేదు. కష్టం వస్తే వదిలేస్తాను అంటారు. కష్టపడుతూ ఎందుకు కలిసి బ్రతకటం? విడిపోయి సుఖంగా ఉండవచ్చుకదా? ఇది కూడా ఆ క్షణానికి సరైనదే అనిపిస్తుంది. కానీ జీవితంలో తోడు లేకుండా బ్రతకటం అంత సులభమా? దానికి ఎంతో పరిణతి కావాలి. మరెంతో ఓర్పు కావాలి.
మీ పిల్లలను చదివించటం ఎంత ముఖ్యమో వాళ్లకు జీవితంలోని వివిధ అంశాల గురించి చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంటుంది. ప్రేమకు లొంగని ప్రాణి ప్రపంచంలోనే ఉండదు అంటారు. మీరు మీ పిల్లల ప్రవర్తన నచ్చనప్పుడు వేడిలో ఎదో ఒకటి అని అది వాళ్ళ మనసులో మీ స్థానాన్ని దిగజార్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి సంఘటనలు అస్సలు జరగకుండా ఉండటం చాలా అరుదు. కానీ వాళ్లకు తరువాత అయినా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉండండి. జీవితం అంటే జీతం, భోజనం, బట్టలు, నిద్ర కాకుండా ఇంకా చాలా పార్శ్వాలు ఉన్నాయి అని గుర్తు చేసుకోండి. మీరు చెప్పించే చదువు కేవలం జీతం ఇవ్వొచ్చు తప్ప గొప్ప జీవన విధానాన్ని ఇవ్వలేవు అని గ్రహించండి.
కనీసం ఇదంతా చేయలేకపోయినా పెళ్లి కి ముందు కాస్త కౌన్సిలింగ్ ఇప్పించండి. పెళ్లి ఏమిటి, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలా మెలగాలి, ఎంతవరకు సహనం, ఏది దాటితే అనర్ధం, ఏది ముఖ్యం, ఏది అనవసరం ఇలా వాళ్ళు తెలుసుకునే అవకాశం మీరు కల్పించాలి.
ప్రేమ పెళ్లిళ్లు చేసినా సరే వాళ్ళ మధ్య బంధం నిజం అనే పునాది పైన స్థిరంగా ఉంటుంది అనే భరోసా మీకు రావాలి. మీకు వీలైనంత సున్నితంగా పరిస్థితిని చక్కబెట్టండి.
అందరికీ శుభం కలగాలి అని ఆశిస్తూ - స్వస్తి
Comments
Post a Comment