Skip to main content

భవిష్యత్తు కోసం ముందడుగు

ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితం పైన ఎన్నో ఆశలు ఉంటాయి. ఆ ఆశలు తీర్చుకోవటానికి వాళ్ళు పని చేస్తారు. ఆ ఆశలు తీర్చుకోవటానికి ఏం చెయ్యాలో వాళ్ళకు తెలుసో లేదో అనే దాన్ని బట్టి వాళ్ళ జీవిత లక్ష్యం నెరవేరే అవకాశం ఆధారపడి ఉంటుంది. 

ఏం చెయ్యాలో తెలిస్తే సాధించేస్తారా అంటే అది చెప్పలేం. కానీ తెలియకపోతే సాధించరు అనుకోవచ్చు కదా! ఇది ఒక్కటే కాదు కానీ ఇది ఒక ముఖ్య కారకం అని చెప్పవచ్చు.

రెండవ అంశం - ఏం చెయ్యాలో తెలిసినా, ఎలా చెయ్యాలో తెలియాలి కదా! ఈ జ్ఞానం ఎడ్యుకేషన్ ఇస్తుంది. ప్రతి ఆశకీ పాఠశాలలో చెప్పే పాఠాలు సమాధానాలు చెప్పవు. ఇక్కడే వచ్చింది చిక్కు. జీవితం మనకు ఇచ్చే ప్రతి సవాలుకు సమాధానం పాఠశాలలు చెప్పటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ విశాల విశ్వంలో అవకాశాలు, సమస్యలు, పరిష్కారాలు అంతులేనన్ని ఉన్నాయి. జీవిత కాలం పాఠశాలలో మగ్గబెట్టినా మొత్తం నేర్చుకునేందుకు సమయం సరిపోనన్ని అవకాశాలు. 

కనుక విషయ పరిజ్ఞానం పైన కంటే సమస్య నుండి పరిష్కారం దిశగా ఎలా వెళ్ళాలో నేర్పించే విద్య ఎంతో విలువైనది. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ దృష్ట్యా సమాచారం మనం గుర్తుపెట్టుకుని తిరిగి చెప్పాల్సిన అవసరం లేదు ఇంక. ఇది మానవ జాతికి అతి పెద్ద మలుపు అనుకోవచ్చు. సమస్యలను మనం చూసే పంధా మారాలి. ఇప్పటి వరకు అసాధ్యం అని వదిలేసిన సమస్యలకు పరిష్కారాలు వెతకటం పైన శ్రద్ధ పెట్టాలి. 

పర్యావరణ సంరక్షణ, శారీరకమైన, మానశికమైన సంక్లిష్ట పరిస్థితులు, పరిమితులు అధిగమించటం, మరింత మెరుగైన సామాజిక వ్యవస్థను అభివృద్ధి చెయ్యటం, ఒకరంటే ఒకరికి గౌరవం, అభిమానం, అక్కర ఉండే సమాజాన్ని నిర్మించుకునే అవకాశం ఇప్పుడు మనకు అందుతుంది.

ఇతరుల పట్ల పరుషంగా వ్యవహరించే అలవాటు మానవ జాతిలో ఉండటానికి కారణం పరిమితమైన వనరులు. అవి ఎవరి అజమాయిషీలో ఉంటే వాళ్లు సుఖంగా జీవించ గలరు. మిగిలిన వాళ్లు కష్టపడాలి. ఐతే ఆ వనరులను వినియోగించటానికి మనకున్న పరిజ్ణానం కూడా పరిమితం కావటం ఇంకా పెద్ద సవాలు. ఈ సవాలును మనం ఇప్పుడు కృత్రిమ మేధస్సును (AI) ఉపయోగించి అధిగమించే అవకాశం దొరుకుంది. వివరాల పట్ల కాక సమస్యని అధిగమించటానికి  మన మేధస్సుని వినియోగించేలా పదును పెట్టాలి. ఇదివరకటిలా ఒకరు ప్రయత్నించి విఫలమైన దారిని మనం మళ్లీ ప్రయత్నించవలసిన అవసరం లేదు. విశ్వవ్యాప్తమైన ఇంటర్నెట్, సమాచారనిధులు ఉన్నాయి కదా! కాబట్టి విఫలమైనదాన్ని ఎలా మెరుగు పరిచి లక్ష్యం వైపు దూసుకువెళ్లాలి అనేది మనం శోధించాలి. మానవ మేధస్సుకు మాత్రమే సొంతమైన వైశాల్యం ఎప్పటికీ కృత్రిమ మేధస్సుకు సాధ్యం కాదు. ఈ విశ్వంలో నిరంతరం హద్దులు లేకుండా వైశాల్యం పెంచుకోగల ఒకే ఒక్క పదార్ధం మానవ మేధస్సు.

ఇంతవరకూ మనం ఆలోచనా విధానం మార్చుకుని ఎప్పుడైనా ఏమైనా సాధించామా అనే ప్రశ్న మనసులో కదలొచ్చు. ఔననే సమాధానం ఘంటాపధంగా చెప్తుంది మానవ చరిత్ర. అడవులలో ఆకులు కప్పుకుని ఆహారం కోసం నిత్యం వేటాడిన నియాండెర్తల్ నుండి నేటి మానవుడికి జన్యుపరమైన భేదం పెద్దగా లేదు. కానీ మానశిక వ్యవస్థ ఎన్ని సార్లు మార్పు చెందిందో లెక్కా పద్దూ లేదు. అలాంటి కొన్ని అనుభవాలను టూకీగా చూద్దాం.


బుద్ధి వికాసం: మనుగడ కోసం పోరాటం నుండి ఆసక్తి వైపుకి 

ప్రాథమిక మానవులు ప్రధానంగా ప్రవృత్తులపై ఆధారపడ్డారు — వేట, ఆహారం, జీవనాధారం. కానీ సుమారు 70,000 సంవత్సరాల క్రితం, మనకు ఊహించగల సామర్థ్యం, కథలు చెప్పడం, కల్పిత విశ్వాసాలను పంచుకోవడం మొదలయ్యింది. ఇదమిత్థంగా ఇదీ సమయం అని మనం అనుకోవాల్సిన అవసరం లేకపోయినా చాలా కాలం క్రితం అనుకోండి పోనీ! మార్పు అయితే వాస్తవమని అంగీకరించ గలం కదా.

మౌలికమైన మార్పు: కథలు చెప్పడం, ఉమ్మడి దృక్పథం ఇప్పటికీ నాయకత్వం సాధించడంలో కీలకం.

ప్రభావం: పెద్ద సమూహాల్లో సహకారం, సంస్కృతికి పునాది వేసింది.


సాధికారత: వేటగాడి నుంచి రైతుగా

సుమారు 10,000 సంవత్సరాల క్రితం, వ్యవసాయ విప్లవంతో మనిషి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుని, భూమిని స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఏ కాలం లో విత్తనాలు వెయ్యాలి, ఏ సమయంలో నీరు పెట్టాలి, నీరు ఎలా మళ్లిస్తే సునాయాసంగా పంటలు పండించవచ్చు,  ఏ పంట అవసరం, ఏ రకం ఎక్కువ దిగుబడి ఇస్తుంది, ఎలాంటి పనులు దిగుబడిని పెంచుతాయి, ఎలాంటి మొక్కలు దిగుబడిని తగ్గిస్తాయి - ఇలా ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన యాజమాన్య పద్ధతులు అనుసరించి దిగుబడి పెంచి ఆహార భద్రతను పొందాం. వ్యవసాయం చుట్టూ గొప్ప సంస్కృతిని నిర్మించుకున్నాం. 

ఆహార భద్రత పొందిన తరువాత మన సంస్కృతిలో ఆనందం, కళలు, శాస్తాలు, జ్ఞానం, విజ్ఞానం, వినోదం, ఇలా ఎన్నో రీతులలో ప్రగతిని సాధించాం.

మైండ్‌సెట్ మార్పు: "నేను పరిసరాలను మార్చగలను, వాటిలో జీవించాల్సిన అవసరం లేదు."

ప్రభావం: గ్రామాలు, ఆహార మిగులు, జనాభా పెరుగుదల, సామాజిక శ్రేణులు.

పాఠం: దీర్ఘకాలిక ఆలోచన, ఓర్పు అవసరం.


శాస్త్రీయ ఆలోచన: మతం నుండి తర్కానికి

ప్రజలు అధికారాన్ని ప్రశ్నించటం, నిజాన్ని శోధించటం మొదలుపెట్టారు. మతాన్ని మించి శాస్త్రాన్ని నమ్మడం మొదలైంది. పుస్తకంలో వ్రాసున్న దాన్ని నిజం అని ఒప్పుకోవలసిన అవసరం లేదు. నిజం తనంతట తాను నిలబడగలదు. దానికి ఎవ్వరి సెక్యూరిటీ అవసరం లేదు. నిజమే నిజమైన అధికారి.

ఇంక మతానికి విలువ లేదా అంటే ఉంది. అది వ్యక్తిగత పరిణతికి సహాయం చేస్తుంది. అది ఒకరిపైన రుద్దటం గానీ, పాటించని వారిని చంపటం గానీ హింసించటం గానీ, మత విశ్వాసం ఆధారంగా ఇతరులని దూషించటం కానీ ఇబ్బంది పెట్టటం కానీ సముచితం కాదు. ఇతరులకు ఇబ్బంది కలగనంతవరకు ఎవరి విశ్వాసం వారిది. ఇతర మతాలని నిందించటం, ఒక్క మతమే నిజం, మిగిలినవన్నీ అబద్ధం లాంటి పనికిమాలిన భావజాలం ప్రదర్శించటం గర్హనీయం.

మతం దగ్గరకి వచ్చేసరికి ఇంతవరకు రాని ఎమోషన్స్ గద్గదమైన స్వరానికి మారిపోతాయి. దీనికి కారణం - మతం నుండి దూరం జరిగి ఇంకా ఎక్కువ కాలం కాలేదు కదా. ప్రతి మార్పు ఒక రకమైన బాధను కూడా తెస్తుంది. పీత పరిణతి గురించి తెలుసా మీకు? అది గట్టి పెంకు కలిగి ఉంటుంది. అది దాని రక్షణ వ్యవస్థ.  అలాంటి పెంకుని చీల్చుకుని బయటికి వచ్చి పెరుగుతుంది. దాని జీవిత కాలంలో దాదాపు 15-20 సార్లు ఇలా పెంకుని చీల్చుకు వచ్చి పెరుగుతుంది. మనం ఎప్పుడూ ఇలా శారీరకంగా చెయ్యాల్సిన అవసరం లేదు. మానసికమైన ప్రక్రియ మాత్రమే. కనుక మతంలోని మంచిని మీ జీవితం బాగుచేసుకోవటానికి వాడుకోండి. దాన్ని మాత్రమే నిజం అని అపోహలో ఉండిపోకండి. మత కధలన్నీ మనసుకు సంబంధించిన విషయాలని మనకు అర్ధం కావటానికి వ్యక్తీకరణ సౌలభ్యం కోసం కధల రూపంలో వివరించి ఉంటారని నా అభిప్రాయం.

మైండ్‌సెట్ మార్పు: "తెలిసినది పరీక్షించవచ్చు, మెరుగుపరచవచ్చు."

ప్రభావం: ఆవిష్కరణలు, వైద్య విజ్ఞానం, పరిశ్రమల విప్లవం.

సారాంశం: ప్రశ్నించే, విశ్లేషించే మనస్తత్వమే కొత్తదనాన్ని తెస్తుంది.


పారిశ్రామిక ప్రవృత్తి: ప్రాంతీయంగా ఉండటం నుండి ప్రపంచ దృష్టికి

పరిశ్రమల విప్లవం అంటే కేవలం యంత్రాలు కాదు — అది స్థాయి పెంపు, వ్యవస్థీకరణ, సమయం విలువ గుర్తించడంపై ఆధారపడి ఉంది. ఉమ్మడి అవసరాలను పరిశ్రమలు, పద్ధతుల ఆవిష్కరణ ద్వారా తక్కువ ధరలకు ఎక్కువ ఉత్పాదకతను పెంపొందించుకున్నాం. అవసరాలకు అనుగుణంగా పద్ధతులను, పరిశ్రమలను మార్చుకుంటూ అభివృధి సాధించాం. అవగాహన పెంచుకుని మరింత మెరుగైన సామాజిక పరిస్థితులను నెలకొల్పుకున్నాం.

మైండ్‌సెట్ మార్పు: విలువను సృష్టించవచ్చు, పెంచవచ్చు, దాచిపెట్టవచ్చు.

ప్రభావం: పట్టణీకరణ, పాఠశాలలు, గ్లోబల్ వ్యాపారం

నేటి సంబంధం: స్టార్ట్‌ప్ సంస్కృతి, గ్లోబల్ మార్కెట్


డిజిటల్ మైండ్‌సెట్: సమాచార కొరత నుండి సమృద్ధికి 

20వ, 21వ శతాబ్దాల్లో సమాచారాన్ని అందరికీ చేరేలా చేశాం. ఇప్పుడు ఎవరైనా నేర్చుకోవచ్చు, పంచుకోవచ్చు, సృష్టించవచ్చు. జీవితం సుఖవంతం చేసుకున్నాం. ప్రతి సమస్యను సమాచారం ఆధారంగా పరిష్కరిస్తూ ఎక్కువ నికర విలువను పెంచుకునే దిశగా అడుగులు వేశాం. ఈ బ్లాగ్ చదువుతున్న వాళ్ళలో అత్యధిక శాతం మంది ఖచ్చితంగా విలాసంగా బ్రతికిన మొట్టమొదటి తరం. ఏం అంత విలాసం అనుకోకండి. మన తల్లిదండ్రులు మన కంటే ఎక్కువ శ్రమ పడి తక్కువ వేతనం / విలువ అందుకున్నారు. వాళ్ళ కష్టానికి మనం పడ్డ కష్టానికి చాలా తేడా ఉంది కదా! అది విలాసం కాదా? కార్లు, పక్కా ఇళ్ళు, ఆభరణాలు, ఇవన్నీ విలాసాలు కావంటారా?

మైండ్‌సెట్ మార్పు: ఎవరికైనా సాధ్యమే — నేర్చుకోవడం, నిర్మించడం, ప్రభావం చూపించడం.

ప్రభావం: ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఫ్రీలాన్సింగ్, ఆన్లైన్ విద్య.

ఆచరణీయం: వేగంగా నేర్చుకుని, మార్పులకు సవ్యమైన రీతిలో స్పందించే వారు విజయవంతం అవుతారు.


కొత్త పరిస్థితులు తెస్తున్న భయాలు - సమాధానాలు

కృత్రిమ మేధస్సుకు (ఏఐ) సంబంధించిన పరిశోధనలు చాలామందిని కలవరపెడుతున్న విషయం వాస్తవమే. ఉద్యోగాలు కోల్పోతామేమో అనే బెంగ, అంతకంటే ముఖ్యంగా సాధారణ పరిస్థితులలో ఉద్యోగం కోల్పోతే ఇంకొకటి వెతుక్కుంటాం. ఈ పరిస్థితుల్లో ఇంకో ఉద్యోగం దొరకదు కదా అనే కలవరపాటు ఎక్కువగా చూస్తున్నాము. కానీ ఒక్క విషయం గుర్తు చేసుకోవాలి. ధనాన్ని కరెన్సీ అని పిలుస్తారు. ఎందుకో తెలుసా? అది ప్రవహిస్తూనే ఉంటుంది కాబట్టి. కరెంట్ అంటే ప్రవాహం అని అర్ధం. అది ఒక్కరి దగ్గర ఉండిపోతే దానికి విలువ శూన్యం అయిపోతుంది. ప్రతి కరెన్సీ నోటు పైన ఏదో ఒక భాషలో "ఈ నోటు ఉన్న వారికి ఇంత విలువ ఇస్తున్నట్టు ప్రమాణం చేస్తున్నాను" అని ఆ దేశ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం ఉంటుంది. ఆ ప్రమాణానికి అర్ధం ఆ నోటు చేతులు మారుతున్నంత వరకే. అది మారటం ఆగిపోతే దానికి పెద్ద విలువ ఏమీ ఉండదు. ఈ ధనం, ఆర్ధిక వ్యవస్థ మన సౌకర్యం కోసమే సృష్టించబడ్డాయి. మనమే లేకపోతే దానికి విలువ ఏమీ ఉండదు. ఒకరి కష్టాన్ని విలువ కట్టి వారికి ఏదో రూపంలో చెల్లించాలి. ఇందుకు మొట్టమొదట వాడుకలోనికి వచ్చిన విధానం వస్తు మార్పిడి విధానం.

ఉద్యోగం పోతే మనకు వచ్చే అతి పెద్ద బెంగ ఏమిటి? నా కుటుంబం ఎలా మనగలుగుతాము అనే కదా! అంటే అలాగే జరుగుతుంది అని నేను అనుకోవటం లేదు. ఆర్ధిక వ్యవస్థ పైన నాకున్న పాటి అవగాహనతో నాకు అర్ధమైన విషయం ఆర్ధికవేత్తలకు, అపర మేధావులకు అర్ధం కాదా? కానీ మన సంతృప్తి కోసం కాస్త పరిశీలించి చూద్దాం.

ఉద్యోగం పోతే మన లాంటి వాళ్ళు చాలా మందే ఉంటారు కదా! సమాజం అంటే ఒకరికి ఒకరు సహాయం చేసుకుని అందరం సుఖంగా జీవించగలిగే ఒక ఏర్పాటు. అంతే కదా? 

మనందరం కలిసి ఒక కొత్త వ్యవస్థని రూపొందించుకుందాం. పనులు పంచుకుందాం. అన్ని పనులకు ఒకే రకమైన విలువ ఉండేలా చూసుకుందాం. ఇప్పటి ఆర్ధిక వ్యవస్థ లో ఉన్న లోపాలు సరిదిద్దుకుని కొత్త వ్యవస్థని రూపొందించుకుందాం.

ఉద్యోగం పోయినా ప్రకృతి మారలేదు. అది మనకు ఆహారాన్ని ఇచ్చే పద్ధతీ మారలేదు. ఎవరో కొద్ది మంది ప్రపంచాన్ని మొత్తాన్నీ శాసించలేరు. వాళ్ళకు ఇతరుల సాయం కావాలి. ఎంత టెక్నాలజీ వచ్చినా ప్రజాస్వామ్యం ఉన్నంత వరకూ మనకు నచ్చని ఏదైనా మార్చే అధికారం మన చేతిలోనే ఉంది. ప్రభుత్వం మనం ఎన్నుకుంటేనే ఏర్పడింది. మనం వద్దనుకుంటే కూలిపోతుంది. అసలు ఏ ప్రభుత్వమైనా ప్రజలందరూ వద్దనుకున్నప్పుడు కూలిపోక తప్పదు. ఇది చరిత్రలో ప్రతి పేజీలో ఉన్న ప్రూఫ్. కాబట్టి సాధారణ మానవులందరూ ఏక తాటి పైకి వస్తే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనగలం. అది స్వాతంత్ర్య పోరాటమైనా, పారిశ్రామిక విప్లవమైనా, ఇంకేదైనా సరే. సామాన్య మానవులు వాళ్ళ శక్తినీ యుక్తినీ వాడటం మొదలు పెడితే ప్రపంచం అతి వేగంగా మార్పు చెందుతుంది.

మరి జీతం ఆగిపోతే ఇల్లు, కారు, ఇయెమ్మైలు, అప్పులు, అప్పులోళ్ళు, వీటన్నిటి సంగతేంటి? 

ఇప్పుడు ధనవంతులు వాడే ఆయుధం మనందరం వాడుతాం! దివాళా పిటిషన్. అందరూ దివాళా పిటిషన్ పెడితే ఇక ఎవడు మాత్రం ఏం చేస్తాడు? పాత వ్యవస్థ రద్దవుతుంది. కొత్త వ్యవస్థ లో మన కష్టం విలువ ఆధారంగా మనకు ఇవ్వవలసిన విలువ ఇవ్వబడుతుంది. టెక్నాలజీ వాళ్ళకే కాదు. మనకి కూడా తెలుసు. ఎవరి తోనూ యుద్ధం చెయ్యటం మన ఉద్దేశం కాదు. కానీ మనని వెనక్కి నెట్టేస్తే యుద్ధం చెయ్యటానికి వెనకాడం. 

సకారాత్మక దృక్పధంతో సమస్యలను ఎదుర్కోవటం ముఖ్యం. మన ఆహార సరఫరా, నిత్యావసరాల సరఫరా, కుటుంబం మనగలిగే మౌలిక సదుపాయాలు కల్పించుకునే వ్యవస్థను మనం రూపొందించుకుందాం. అందుకు అవసరమైన చట్టాలు మనం చేసుకుందాం. కొత్త వ్యవస్థలు మనమే నిర్మించుకుందాం. ధన మదాంధులను ఇతర గ్రహాలకు పంపేద్దాం. అత్యాశపరులు వెళ్లిపోతే భూమికి భారం తీరిపోతుంది. మన గ్రహం అలాంటి మానవుల పనుల వల్లనే దెబ్బ తింది. వాళ్లు లేకపోతే మళ్లీ ప్రశాంతంగా వికసిస్తుంది. 

అసలు జీవిత గమ్యం జీతం తప్ప ఇంకేం లేదా?

జీతం మెండుగా ఇచ్చి చెరసాలలో వేస్తే ఉంటామా? ఉండలేము కదా! జీతం బాగా ఇచ్చి ఒక్క పూట తిని ఉండమంటే ఉంటామా? ఉండము కదా! జీతం బాగా ఇచ్చి కుటుంబాన్ని, హితులని, స్నేహితులని వదిలెయ్యమంటే వదిలేస్తామా? జీతం బాగా ఇచ్చి వాళ్ళ ఇష్టమొచ్చినట్టు ఉండమంటే మనకు కుదరదు. ఎందుకు? మన జీవితం పైన మనకు చాలా అంచనాలు, ఆశలు ఉంటాయి కదా!

అందుకే జీతం ఒక అంశం మాత్రమే. జీతమే జీవితం కాదు. నీ ఆనందం ఎక్కడ ఉందో తెలుసుకో. ఆ ఆనందం ఎలా పదిలపరుచుకోవాలో తెలుసుకో. జీతం ఉన్నా లేకున్నా, మేడలు మిద్దెలు ఉన్నా లేకున్నా, ఆస్తులు అంతస్తులు ఉన్నా లేకున్నా జీవితం ఏం ఆగిపోదు. సమస్యలు మనకి కొత్తేం కాదుగా! ధైర్యంగా ఉండు. ఎప్పుడు భయపడతావో అప్పుడు పడతావు. ఎప్పుడు ధైర్యంగా నిలబడతావో అప్పుడు ముందుకు అడుగేస్తావు.

నువ్వు ఆనందంగా ఉండటానికి నీకు ఏమి కావాలి?

గొర్రెల మంద లాగా ఎవడి కలనో సాకారం చెయ్యటానికి మన జీవితాన్ని ఖర్చుపెట్టి కష్టపడటం నిజంగా తెలివైన పనేనా? అసలు కార్పొరేట్ కంపెనీలు మనకు పడేసే జీతం, మనం వాళ్ళకు క్రియేట్ చేసిన విలువలో ఎన్నో వంతు? కన్సెల్టెన్సీ కంపెనీలు ఇంక మనగలవా?

ఇది కొత్త యుగం. మనకు మనం నిలబడగల నవయుగం. మన జీవితానికి మనం పని చేసే మంచి కాలం ముందు పెట్టుకుని భయం నీడలో నిలబడిపోకలా. 

నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు? వాళ్ళ తీరని కోరికలు ఏమిటి? వాళ్ళ తీరని అవసరాలు ఏమిటి? ఆ అవసరాలు నువ్వు తీర్చగలవా? ఇలా సకారాత్మక ప్రశ్నలలో నీ భవిష్యత్తు ఎదుగుదల దాగి ఉంటుంది. ఉద్యోగాలు పోయినంత మాత్రాన జీవితం ఆగిపోదు. మనలో కష్టం తెలియని వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అసలు లేకపోవచ్చు కూడా!

ప్రతి పరిణామం ముందు మనసులో జరుగుతుంది

ప్రతి మానవ పురోగతీ మనసులోనే మొదలైంది. మనసు మారితే సాధనాలు, వ్యవస్థలు, సమాజాలు మారాయి. ఇప్పుడు మనం ఏఐ యుగానికి సన్నద్ధమవుతున్నాం — కేవలం సాంకేతికత వల్ల కాదు, అభిప్రాయాలను తిరిగి పునఃపరిశీలించుకోవటానికి సిద్ధంగా ఉన్నందు వలనే.

మీ పరిస్థితులు మారాలనుకుంటున్నారా? మనస్తత్వాన్ని మార్చుకోండి. భవిష్యత్తు మొత్తం పరిమితులను దాటి ఆలోచించే వారిదే. మానసిక పరిమితులను దాటి ఆలోచించటం కాస్త ఇబ్బంది గా అనిపించటం సహజం. అవి మన మనుగడకోసం మనమే ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న కోటలు. బాధ ఉంటుంది మరి. కానీ ఆ కోటలు బద్దలుగొట్టుకుని ముందుకు సాగకపోతే అవే కోటలు మనని బంధించే కారాగారాలుగా మారిపోతాయి. పైన ఉదహరించిన పీత కధను మళ్లీ గుర్తు చేస్తున్నాను. మనం కోటలు గా భావించి నిర్మించుకున్న కంచెలే మనకు అడ్డు గోడలు. అవి దాటి ఆలోచిస్తేనే అవకాశాలు మనకు అందుతాయి.

మీ అభిప్రాయం చెప్పండి. అందరం కలిసి మన అవగాహన పెంచుకుందాం. పరస్పరం అవసరాలు తీర్చుకుందాం.


Comments

Popular posts from this blog

గుండె సవ్వడి

గుండె సవ్వడి!  ఇది తెలుగు వారి గుండె సవ్వడి!  మన తెలుగు వారి మనసుల్లో ఆలోచనలు కూడా తెలుగులోనే ఉంటాయి కదండీ! అందుకే మనందరి మనసులకు అద్దం పట్టేలా ఈ తెలుగు బ్లాగ్ మొదలుపెట్టాను.  నా పేరు కుంచాల. వంశీ కృష్ణ. వృత్తిపరంగా నేనొక సాఫ్ట్వేర్ ఇంజినీర్. ప్రవృత్తిపరంగా నేనొక తెలుగు వాడిని. సంస్కృతి, సాంకేతికతల మేలి కలయిక మన సంస్కృతి విలువను మరింత పెంచుతుందని నా నమ్మకం. తెలుగును జగద్విఖ్యాతం చెయ్యటంలో సాంకేతికత సముచిత పాత్ర పోషించిందనటం నిర్వివాదం. హైటెక్ సిటీ నుండి ప్రపంచ కోణ కోణాలకు తెలుగు విస్తరించి ఉందంటే అతిశయోక్తి కాదేమో! నాకు మన తెలుగు భాష అన్నా, మన సంస్కృతి అన్నా ఎనలేని మక్కువ. తెలుగు లో మాట్లాడే ప్రతి పదం మనసుకు ఇంపుగా ఉంటుంది నాకు. ఇది చదువుతున్నారు అంటే మీకు కూడా అలాగే ఉంటుంది అని భావిస్తున్నాను. తెలుగదేలయన్న తెలుగొకండ అన్నారు శ్రీ కృష్ణ దేవరాయలు. మన  తెలుగు చరిత్ర పైన,  తెలుగు ఆచార వ్యవహారాల పైన,  సనాతన సంస్కృతి పైన: తర్కబద్ధమైన, సకారాత్మకమైన, ఉత్తేజభరితమైన, ఉల్లాసభరితమైన వివరాలు సేకరించి పొందుపరచటం ఈ బ్లాగ్ లక్ష్యాలలో ఒకటి. మన ముందు తరాల వారికి ఇది ఒక వారసత...

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

యత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమంతి దేవతాః | యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలాః క్రియాః॥ - మను స్మృతి అధ్యాయం 3, శ్లోకం 56 మెదటి చరణం అందరికీ తెలిసిందే. ఆడవారు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని అర్థం. కానీ రెండో చరణం అర్థం మనుస్మృతి లో స్త్రీ కి ఉన్న గౌరవం, ప్రాముఖ్యత ఉటంకిస్తూ ఉంది. యత్రైతాస్తు న పూజ్యంతే = యత్ర + ఇతి + న + అస్తు + పూజ్యంతే = ఎక్కడ ఆమె పూజించబడదో సర్వాస్తత్రాఫలాః క్రియాః = సర్వః + తత్ర + అఫలాః + క్రియాః = అక్కడ ఏ పనీ ఫలించనట్టే. అంటే ఎక్కడ స్త్రీ గౌరవించబడదో అక్కడ ఏమున్నా, ఎంతున్నా నిష్ప్రయోజనం అని. స్త్రీ కి గౌరవం ఇవ్వండి అని చెప్పి ఊరుకోలేదు. ఆమెకు గౌరవం ఇవ్వని చోట ఇంకేమీ విలువైనది కాదు అని తర్కపూర్ణంగా ఉటంకిస్తూ చెప్పారు.  ఇది మన సంస్కృతిలో స్త్రీ యొక్క స్థానం. ముష్కర మూకలు మన మీద దాడి చెయ్యక ముందు కాలంలో స్త్రీకి అన్ని వ్యవహారాలలో అవకాశం, గౌరవం ఉండేది. స్త్రీ తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవటానికి నిర్ణయించుకున్నా, విద్య నుంచి యుద్ధం వరకు ఏ అంశంలో ఉండాలని నిర్ణయం తీసుకున్నా సమానమైన గౌరవం ఉండేది. వేదాలు వ్రాసిన వారిలో లోపముద్ర వంటి స్త్రీ మూర్త...

🌿 ఉగాది పండగ - ఎందుకు, ఏమిటి, ఎలా?

  ఉగాది అంటే కేవలం ఒక పండుగ కాదు… ఇది కొత్త ఆలోచనలకు, కొత్త ఆశలకు, కొత్త జీవనానికి ప్రారంభం. ఉగాది  - యుగాది అనే పదం నుండి వచ్చింది. “యుగాది” అంటే  “యుగం + ఆది” — అంటే కాలానికి ఆరంభం అని అర్ధం . తెలుగు ప్రజల కోసం ఇది నూతన సంవత్సర ప్రారంభం మాత్రమే కాదు, జీవితాన్ని కొత్త కోణంలో చూడటానికి ఒక అవకాశం. 🌼 వసంత ఋతువు – ప్రకృతి ఉత్సవం ఉగాది వసంత ఋతువు ప్రారంభం. ప్రకృతి కొత్త జీవితాన్ని అందుకుంటుంది. శరీరానికి, మనసుకు హాయిగా ఉంటుంది మామిడి పూలు వేప పువ్వులు పచ్చని చెట్లు ఇది ప్రకృతి మనకు ఇచ్చే ఒక అవకాశం.  ఉపయోగం లేని అలవాట్లు విడిచిపెట్టి జీవితానికి సహకరించే అలవాటులను, అవకాశాలను ఆహ్వానించాలి. 🌸 ఉగాది యొక్క ప్రాముఖ్యత చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సంవత్సర ఆరంభం జరుగుతుందని పంచాంగ శాస్త్రం చెబుతుంది. పురాణాలలో సృష్టి ఆరంభం వసంతంతో మొదలౌతుంది అని చెప్పబడటం చేత, ఈ రోజును ‘యుగాది’గా భావించడం సాంప్రదాయంగా ఏర్పడింది.   బ్రహ్మ దేవుడు  ఈ రోజే సృష్టిని ప్రారంభించాడని విశ్వాసం ఉంది. వసంతం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున మొదలౌతుంది. శాస్త్రాలు, పురాణాలు, వేదాలు నమ్...